న్యూఢిల్లీ: తన నాయకత్వ పటిమతో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన మేటి క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని... క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్)లో ప్రపంచ టైటిల్స్‌ను అలవోకగా సాధించే అలవాటున్న భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కేంద్ర ప్రభుత్వం అం దించే దేశ అత్యున్నత మూడో పౌర పురస్కారం ‘పద్మ భూషణ్’కు ఎంపికయ్యారు. మరో నలుగురు క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్ (బ్యాడ్మింటన్–ఆంధ్రప్రదేశ్), సోమ్‌దేవ్ (టెన్నిస్–త్రిపుర), మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్–మణిపూర్), మురళీకాంత్ పేట్కర్ (స్విమ్మింగ్–మహారాష్ట్ర)లకు ‘పద్మశ్రీ’ పురస్కారాలు లభించాయి.
జార్ఖండ్‌కు చెందిన 36 ఏళ్ల ధోని కెప్టెన్సీలో భారత్ టి20 వరల్డ్ కప్ (2007లో), వన్డే వరల్డ్ కప్ (2011లో), చాంపియన్స్ ట్రోఫీ (2013లో) టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ధోని 2014లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో ‘పద్మశ్రీ’ పురస్కారం గెల్చుకున్న ధోని ప్రస్తుతం వన్డే, టి20 ఫార్మాట్‌లలో కొనసాగుతున్నాడు. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల పంకజ్ అద్వానీ ఇప్పటివరకు 18 ప్రపంచ టైటిల్స్ సాధించాడు. గతేడాది వరల్డ్, ఆసియా స్నూకర్, బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచాడు. 2009లో ‘పద్మశ్రీ’ అవార్డు పొందిన పంకజ్ 2006లో ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... 2004లో ‘అర్జున అవార్డు’ కూడా పొందాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ గతేడాది అద్వితీయ ప్రదర్శన చేశాడు. నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ (ఇండో నేసియా, ఆస్ట్రేలియన్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్) సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకాడు. మణిపూర్‌కు చెందిన 23 ఏళ్ల మీరాబాయి చాను గతేడాది ప్రపంచ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. 1995లో కరణం మల్లీశ్వరి తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం నెగ్గిన రెండో లిఫ్టర్‌గా ఆమె గుర్తింపు పొందింది. త్రిపురకు చెందిన 32 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 2010 కామన్వెల్త్ గేమ్స్, 2010 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించాడు. గతేడాది ఆటకు వీడ్కోలు పలికిన సోమ్‌దేవ్ డేవిస్‌కప్‌లో గొప్ప విజయాలు సాధించాడు. మహారాష్ట్రకు చెందిన 70 ఏళ్ల స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ 1972 పారాలింపిక్స్‌లో 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో 37.33 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణం సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు సృష్టించారు. పారాలింపిక్స్ చరిత్రలో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా చరిత్ర లిఖించారు.
‘పద్మ భూషణ్’ ధోని, పంకజ్
Published Fri, Jan 26 2018 1:02 AM | Last Updated on Fri, Jan 26 2018 1:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment