
కఠిన చట్టంతోనే కళ్లెం
మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లకు పాల్పడిన వారిని కఠిన చట్టాల ద్వారా శిక్షిస్తేనే దీనికి అడ్డుకట్ట వేయగలమని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
న్యూఢిల్లీ: మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్‌లకు పాల్పడిన వారిని కఠిన చట్టాల ద్వారా శిక్షిస్తేనే దీనికి అడ్డుకట్ట వేయగలమని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఫిక్సింగ్‌ను క్రిమినల్ నేరంగా గుర్తిస్తూ కేసులు నమోదు చేస్తే తీవ్రమైన శిక్షలకు ఆస్కారం ఉంటుందని అతను అన్నాడు. ఫిక్సింగ్‌కు దూరంగా ఉండేలా జూనియర్ స్థాయిలోనే క్రికెటర్లకు అవగాహన కల్పించాలని ద్రవిడ్ సూచించాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ముగ్గురు రాజస్థాన్ రాయల్స్ జట్టు క్రికెటర్లు అరెస్ట్ అయిన దాదాపు మూడు నెలల తర్వాత ఈ వివాదానికి సంబంధించి అంశాలపై ద్రవిడ్ తొలిసారి పూర్తి స్థాయిలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. ‘క్రిక్ ఇన్ఫో’ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు అతని మాటల్లోనే...
స్పాట్ ఫిక్సింగ్ వార్త విన్ననాటి స్పందన...
ఒక్క మాటలో చెప్పలేను... కోపం, దుఃఖం, నిరాశ... ఇలా ఒకేసారి అన్ని రకాలుగా అనిపించింది. ఐపీఎల్ బాగా సాగుతోంది. చక్కటి మ్యాచ్‌లతో పాటు మా జట్టు ప్రదర్శన కూడా సంతృప్తికరంగా ఉంది. ఈ దశలో ఫిక్సింగ్ బయటికి వచ్చింది. అప్పటి వరకు మాతో కలిసి తిరిగిన, డ్రెస్సింగ్ రూమ్‌లో అనేక విషయాలు పంచుకున్న ఆటగాళ్లు ఇందులో ఉన్నారని తెలియడం కచ్చితంగా బాధిస్తుంది. ఆ క్రికెటర్లు మమ్మల్ని మోసం చేసిన భావన కనిపించింది. గత మూడు నెలల కాలం నాకు చాలా భారంగా గడిచింది.
సీనియర్ ఆటగాడిగా మానసిక స్థితి...
చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా... ముఖ్యంగా భారత్‌లో క్రికెట్‌కు వీరాభిమానులు ఉన్నారు. వారు మా ఆట చూసేందుకు ఎన్ని కష్టాలు పడతారో తెలుసు. క్రికెట్ చూడటం కోసం అనేక త్యాగాలు చేసే ఎంతో మంది గురించి నేను చదివాను. వారిని మోసం చేసినట్లుగా అనిపించింది. ఇకపై అభిమానులు ప్రతీ సారి ఆటను అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. నేనైతే అభిమానిగా అదే ఆలోచిస్తాను.
ఫిక్సింగ్ రెండు సందర్భాలను చూడటం...
నిజాయితీగా చెప్పాలంటే హాన్సీ క్రానే మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం సమయంలో నేను భారత్‌లో లేను. కెంట్ జట్టు తరఫున కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లండ్‌లో అడుగు పెట్టగానే క్రానే నేరాంగీకార వార్త తెలిసింది. అప్పట్లో ఇప్పటిలాగా నిరంతర కంప్యూటర్, ఇంటర్నెట్ వాడకం లేదు. క్లబ్ ఆఫీస్‌కు వెళితే గానీ ఏమీ తెలిసేది కాదు. పైగా వార్తా చానళ్లు కూడా ఈ సంఖ్యలో లేవు కాబట్టి నాకు పెద్దగా తెలీలేదు. ఆరు నెలలకు భారత్‌లో అడుగు పెట్టేసరికి అంతా సమసిపోయింది. పూర్తిగా కొత్త జట్టుతో నైరోబీలో చాంపియన్స్ ట్రోఫీ ఆడటంతో అంతా పాతబడిపోయింది.
జూనియర్ క్రికెటర్లకు కౌన్సిలింగ్‌పై...
ప్రతీ టోర్నీ, ఐపీఎల్‌కు ముందు ఈ తరహా కౌన్సిలింగ్‌ను అవినీతి నిరోధక సంస్థ ఇస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఇది అంత ప్రభావం చూపడం లేదు. కేవలం అవగాహన కల్పించడం వల్ల ఫలితం ఉండదు. వారు చేసిన తప్పులకు శిక్ష పడాలి. తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు భయపడాలి. కాబట్టి ఫిక్సింగ్‌ను కూడా క్రిమినల్ కేసుగా గుర్తించాలి. అప్పుడు వీటిని నిరోధించగలం. ఇప్పుడు ఆటగాళ్లు కేసు నడుస్తోంది కాబట్టి దానిపై ఏమీ వ్యాఖ్యానించను గానీ పోలీసులే వీటి పని పట్టగలరని నా నమ్మకం.
ఆటగాళ్లు, బోర్డుల విశ్వసనీయతపై...
ఏ జట్టు అయినా, బోర్డు అయినా, ప్రభుత్వమైనా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విశ్వసనీయత ముఖ్యం. నేను ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్పడం లేదు. ఆటగాళ్లలాగే అడ్మినిస్ట్రేటర్‌లలో కూడా మంచివాళ్లు, చెడ్డవాళ్లు ఉన్నారు. ఆట వల్ల కాకుండా ఇతర కారణాల వల్ల మేం మొదటి పేజీ వార్తల్లోకి ఎక్కడం సరైంది కాదు. ఫిక్సింగ్ తరహా ఘటనలు ఆటకున్న విలువను తగ్గిస్తాయి. కాబట్టి అందరూ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి.