రియో చేరిన ‘రిక్షావోడు’
రియో: చైనా రైతు చెన్ గ్వాన్‌మింగ్ తనను తాను ‘ఒలింపిక్ పిచ్చోడు’గా చెప్పుకున్నాడు. అతని ప్రస్థానం చూస్తే మనం కూడా అదే మాట అంటాం. రిక్షా తొక్కుతూ 2010లో బీజింగ్‌లో ప్రయాణం ప్రారంభించిన 60 ఏళ్ల గ్వాన్‌మింగ్...ఆపై లండన్ ఒలింపిక్స్‌కు వెళ్లి, అక్కడినుంచి ఇప్పుడు రియోకు కూడా వచ్చేశాడు. ఇదంతా తన రిక్షాతోనే కావడం పెద్ద విశేషం. సముద్ర సరిహద్దులు ఎదురైన సమయంలో ఓడలో రిక్షాను పంపించి తాను ఫ్లైట్ ద్వారా దానిని దాటేవాడు.
ఒలింపిక్ స్ఫూర్తిని చాటడం, సవాళ్లంటే భయపడేవారిని ప్రోత్సహించడమే తన రిక్షా యాత్రను సాగించేందుకు కారణమని అతను అన్నాడు. పెద్దగా డబ్బులు లేకపోయినా తన సుదీర్ఘ ప్రయాణంలో ఎవరో ఒకరు సహకరిస్తుండటంతో ఇది సాగిందని చెన్ వెల్లడించాడు. అయితే ఇంతా చేసి గ్వాన్‌మింగ్ ప్రత్యక్షంగా ఏ ఒలింపిక్ క్రీడలూ చూడలేదు... కేవలం ప్రధాన వేదిక వద్దకు చేరడంతోనే అతను తన పని ముగించేవాడు.