
నాలుగో టెస్టుకు జాన్సన్ దూరం
సిడ్నీ: తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా పేసర్ మిషెల్ జాన్సన్ భారత్‌తో జరిగే నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. గత వారం జరిగిన మూడో టెస్టులో 33 ఏళ్ల జాన్సన్ గాయపడ్డాడు. ఇదే కారణంతో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లోనూ పాల్గొనలేదు.
గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈనెల 6 నుంచి సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తను పాల్గొనడం లేదని జట్టు ఫిజియోథెరపిస్ట్ అలెక్స్ కౌంటౌరిస్ తెలిపారు. అయితే 16 నుంచి జరిగే ముక్కోణపు సిరీస్‌కు ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ప్రపంచకప్‌కు ముందు జాన్సన్ విషయంలో తాము ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదని, అందుకే అతడికి విశ్రాంతినిస్తున్నట్టు కోచ్ లీమన్ స్పష్టం చేశారు.
స్టార్క్, సిడిల్‌లలో ఒకరికి చాన్స్: జాన్సన్ స్థానంలో ఎడమచేతి పేసర్ మిషెల్ స్టార్క్ లేదా పీటర్ సిడిల్‌లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరి ఫిట్‌నెస్ ఆధారంగా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. బరిలోకి దిగేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్టార్క్ చెప్పాడు. 2011లో తొలి టెస్టు ఆడిన స్టార్క్ జట్టులో చోటును నిలబెట్టుకోలేకపోతున్నాడు.