ఆసీస్‌కు అందేనా..? | Mix of experience and youth in Australia's T20 squad | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు అందేనా..?

Published Sat, Mar 15 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM

ఆసీస్‌కు అందేనా..?

ఆసీస్‌కు అందేనా..?

ఆస్ట్రేలియా... ప్రపంచ క్రికెట్‌లో అగ్రశ్రేణి జట్టు... దశాబ్దాలుగా క్రికెట్‌ను శాసించిన, శాసిస్తున్న కంగారులు టెస్టులతోపాటు వన్డేల్లోనూ తమదైన ముద్ర వేశారు. సంప్రదాయ టెస్టుల్లో అనధికారిక చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు వన్డే ప్రపంచకప్‌లో నాలుగుసార్లు (1987, 1999, 2003, 2007) చాంపియన్‌గా నిలిచింది.
 
 ఇంతవరకు బాగానే ఉన్నా కంగారూలు మాత్రం టి20 ప్రపంచకప్‌కు వచ్చే సరికి మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఇప్పటిదాకా ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ ఫార్మాట్‌లో ఏకంగా నాలుగు ప్రపంచకప్‌లు ముగిశాయి. కానీ ఆస్ట్రేలియాకు మాత్రం పొట్టికప్ అందని ద్రాక్షే అవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గత ప్రదర్శన.. ఈ సారి ఆ జట్టు అవకాశాలపై ఓ లుక్కేద్దాం.
 
 
 2007: సెమీస్‌తో సరి
 దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన 2007 తొలి టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగింది. అప్పటికే వన్డే ప్రపంచకప్ (2007)ను కైవసం చేసుకోవడంతో కంగారూలే ట్రోఫీ ఎగరేసుకుపోతారని అంతా భావించారు. అలా టోర్నీలో కాలర్ ఎగరేసుకుంటూ బరిలోకి దిగిన ఆసీస్‌కు తొలి మ్యాచ్‌లోనే జింబాబ్వే ఝలక్ ఇచ్చింది. ఈ షాక్ నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా చావోరేవో తేల్చే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇక ప్రధాన రౌండ్‌లో పాక్ చేతిలో ఓడినా.. బంగ్లాదేశ్, శ్రీలంకపై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే సెమీస్‌లో ఆస్ట్రేలియాకు ధోనిసేన షాకిచ్చింది. భారీ లక్ష్యాన్ని చేధించలేక కొద్ది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో కంగారూలు ఫైనల్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
 
 
 2009: తొలి రౌండ్‌లోనే...
 ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన రెండో టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా పరిస్థితి మరీ దారుణం. తొలి రౌండ్‌లోనే ఆస్ట్రేలియా అవమానకర రీతిలో టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. గ్రూప్ ‘సి’లో వెస్టిండీస్, శ్రీలంక చేతిలో కంగారూలు చిత్తుగా ఓడిపోయారు. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వైఫల్యానికి ప్రధాన కారణం బౌలర్లే. బ్రెట్‌లీ, మిచెల్ జాన్సన్, షేన్ వాట్సన్ లాంటి బౌలర్లే ఆసీస్‌ను నిండా ముంచారు. ఆస్ట్రేలియా ప్రధాన టోర్నీల్లో ఇంత చెత్తగా ఆడటం ఇదే మొదటిసారి.
 

 2010: చివర్లో బోల్తా
 2009 టి20 ప్రపంచకప్ పీడకల నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా ఆ తర్వాతి ఏడాదే జరిగిన టి20 ప్రపంచకప్‌లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించింది. తొలి రౌండ్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌పై... ప్రధాన రౌండ్‌లో భారత్, శ్రీలంక, వెస్టిండీస్‌లపై నెగ్గింది. ఆ తర్వాత సెమీస్‌లో పాకిస్థాన్‌పై దూకుడును ప్రదర్శించి టైటిల్ రేసులో నిలిచింది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియాను అదృష్టం వరించలేకపోయింది. ఫైనల్లో వైఫల్యంతో రన్నరప్‌తోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది.
 

2012: రెండోసారి సెమీస్‌లో అవుట్
గత ప్రపంచకప్‌లో కొద్దిలో టైటిల్ చేజారడంతో ఈసారి ఎలాగైనా చాంపియన్‌గా నిలవాలన్న పట్టుదలతో టోర్నీలో బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే కంగారూలు ప్రత్యర్థులను మట్టికరిపించారు. తొలి రౌండ్‌లో పసికూన ఐర్లాండ్, వెస్టిండీస్‌లపై విజయం సాధించింది. ప్రధాన రౌండ్‌లో భారత్, దక్షిణాఫ్రికాలపై నెగ్గింది.
 
 ఈ గ్రూప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన పోరులో మాత్రం ఆసీస్ చతికిలపడింది. లక్ష్యఛేదనలో చేతులెత్తేసింది. అయినా రెండు విజయాలతో సెమీస్‌కు చేరుకోగలిగింది. అయితే సెమీస్‌లో ఆసీస్ ఆటతీరు ఏమాత్రం మారలేదు. వెస్టిండీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని చేధించలేక ఓటమిని అంగీకరించింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్ జార్జ్ బెయిలీ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా మిగిలిన వారి నుంచి కనీస సహకారం కూడా లేకపోయింది. దీంతో సెమీస్‌లోనే కంగారూల కథ ముగిసినట్లయింది.
 
 2014 ???
టి20ల్లో ఫేవరెట్  అనే పదానికి చోటు లేకపోయినా... బలాబలాలను బట్టి చూస్తే ఆస్ట్రేలియాకు చాంపియన్‌గా నిలిచే అర్హత ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పటిష్టంగా ఉంది. స్టార్ బ్యాట్స్‌మెన్ బెయిలీ (కెప్టెన్), వార్నర్, ఫించ్, హాడ్జ్, వైట్.... ఆల్‌రౌండర్లు వాట్సన్, క్రిస్టియాన్, ఫాల్క్‌నర్, హాగ్... బౌలర్లు జాన్సన్, స్టార్క్, కౌల్టర్. ఇలా జట్టులో ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు కొదువ లేదు.
 
 బంగ్లాదేశ్ వాతావరణ పరిస్థితులు, అక్కడి పిచ్‌లకు అలవాటు పడి సత్తా చాటితే ఆసీస్‌కు తిరుగుండదు. అలాగే ఈసారి అదృష్టం కూడా తోడైతే కంగారూలు తొలిసారిగా చాంపియన్‌గా నిలవడం పెద్ద కష్టమేమీ కాదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement