న్యూఢిల్లీ: టీమిండియా మాజీ బౌలర్ ఆర్‌పీ సింగ్‌కు క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో చోటు దక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం సౌరవ్ గంగూలీ అధ్యక్షతన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించిన ముగ్గురు సభ్యుల సీఏసీలో ఆర్‌పీ సింగ్ అనూహ్యంగా ఎంపికయ్యాడు. ఈ జాబితాలో మాజీ ఆటగాడు మదల్‌లాల్, సులక్షన్ నాయక్‌తో పాటు ఆర్‌పీ సింగ్‌లు ఉన్నారు. వీరి పదవీకాలం ఏడాది కాలం పాటు ఉండనుంది. మరొకవైపు సెలక్షన్ కమిటీలోకి ఇద్దరు సభ్యులను తీసుకోనున్నారు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో సందీప్ సింగ్ (నార్త్ జోన్), జతిన్ పరాంజపే (వెస్ట్ జోన్), దేవాంగ్ గాంధీ (ఈస్ట్ జోన్) మరో ఏడాది కొనసాగనుండగా, పదవీకాలం పూర్తి చేసుకున్న సెలెక్టర్లు ఎమ్మెస్కే ప్రసాద్ (సౌత్ జోన్), సెలెక్టర్ గగన్ ఖోడా (సెంట్రల్ జోన్) స్థానాలను బీసీసీఐ భర్తీ చేయనుంది. చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్‌కే ప్రసాద్ పదవీ కాలం గత సెప్టెంబర్‌తోనే ముగియగా, అతనికి మరో కొన్నినెలలు పని చేయడానికి అవకాశం కల్పించారు. (ఇక్కడ చదవండి: పంత్ తోపన్నారు.. మరి ఎందుకు తీసుకోరు?)
సెలక్షన్ కమిటీలో సభ్యులను తీసుకోవడానికి దరఖాస్తులను ఆహ్వానించేంత వరకూ ఎంఎస్‌కేను కొనసాగమని సూచించడంతో అతని మరిన్ని నెలలు పనిచేసే అవకాశం దక్కింది. కాగా, ప్రస్తుతం సెలక్టర్ల పదవికి పలు దరఖాస్తులు రావడంతో ఎవరు చీఫ్ సెలక్టర్ అవుతారనే విషయంపై కాస్త సందిగ్థత నెలకొంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందించాడు. ‘ ఎక్కువ టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌ను చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేయడానికి తొలి ప్రాధాన్యత ఇస్తాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న మాజీల్లో ఎక్కువగా టెస్టులు ఆడినవారే చీఫ్ సెలక్టర్ అవుతాడు. ఇది చీఫ్ సెలక్టర్‌ను ఎంపిక చేయడానికి ఉన్న ఒక నిబంధన’ అని గంగూలీ తెలిపాడు. కాగా, చీఫ్ సెలక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, శివరామకృష్ణన్, వెంకటేశ్‌ప్రసాద్, రాజేశ్ చౌహాన్, నయాన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబీ కురువిల్లాలు ప్రధానంగా పోటీ పడుతున్నారు. అయితే ఇక్కడ శివరామకృష్ణన్ తొమ్మిది టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఇక వెంకటేశ్ ప్రసాద్ 33 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా, అజిత్ అగార్కర్ 26 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వెంకటేశ్ ప్రసాద్‌కు జూనియర్ సెలక్షన్ కమిటీలో చేసిన అనుభవం ఉండగా, ముంబై సీనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం అగార్కర్ సొంతం. దాంతో వీరిద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment