నిబంధనలు మార్చాలి: ధోని
మెల్‌బోర్న్: వన్డేల్లో బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ అనుకూలంగా ఉన్న ప్రస్తుత నిబంధనలు మార్చాలని భారత కెప్టెన్ ధోని అన్నాడు. ఐసీసీ అనుసరిస్తున్న నలుగురు ఫీల్డర్ల వ్యూహం వల్ల 50 ఓవర్ల ఫార్మాట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవాల్సి వస్తుందన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ మండలి నిబంధన ప్రకారం మ్యాచ్ మొత్తంలో 30 యార్డ్ సర్కిల్ బయట నలుగురికంటే ఎక్కువ మంది ఫీల్డర్లను ఉంచరాదు. ఈ నిబంధన భారత్ బౌలింగ్‌పై తీవ్ర ప్రభా వం చూపిందని చెప్పిన మహీ సరైన సీమర్ ఆల్‌రౌండర్ లేకపోవడం సెమీస్‌లో దెబ్బతీసిందన్నాడు. ‘ఈ నిబంధనలను మార్చాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. వన్డేల్లో గత చరిత్రను పరిశీలిస్తే డబుల్ సెంచరీలను చూడలేదు. కానీ ఇప్పుడు మూడేళ్ల వ్యవధిలో మూడు ద్విశతకాలు నమోదయ్యాయి.
ఎక్స్‌ట్రా ఫీల్డర్‌ను సర్కిల్ లోపలికి తీసుకురావడంతో చాలా డాట్ బాల్స్ నమోదవుతున్నాయని చాలా మంది అంటున్నారు. అదే లాజిక్ అయితే మరి 11 మందిని సర్కిల్‌లోనే ఉంచితే మరిన్ని డాట్ బాల్స్ వస్తాయి కదా’ అని ధోని విమర్శించాడు. వన్డేల్లో ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు ఉంటే ఆట బోరింగ్‌గా ఉంటుందన్నాడు. ‘తొలి, చివరి 10 ఓవర్లలో ఎలాగూ టి20ల మాదిరిగా ఆడతాం. మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్‌పైనే వన్డేలు ఆధారపడి ఉండాలి. కాబట్టి ప్రస్తుత నిబంధన చాలా కఠినంగా ఉంది. స్పిన్నర్లకు ఇది మరింత భారంగా మారింది. ప్రతి బ్యాట్స్‌మన్ స్వీప్, రివర్స్ స్వీప్‌లతో పాటు ఇతరత్రా షాట్స్ అన్నీ అడుతున్నారు’ అని మహీ వ్యాఖ్యానించాడు.