
న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ఆడిన ప్రతీ టోర్నీలోనూ ఆమె విఫలమైంది. అయితే తనపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, టోక్యో ఒలింపిక్స్‌లో మరో పతకమే లక్ష్యంగా శ్రమిస్తున్నానని సింధు వ్యాఖ్యానించింది. ‘వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత వచ్చిన వరుస పరాజయాలతో నేను కుంగిపోలేదు. సానుకూలంగానే ఉన్నా. ప్రతీసారి గెలవడం సాధ్యం కాదు. కొన్ని సార్లు అద్భుతంగా ఆడితే మరికొన్ని సార్లు తప్పులు జరుగుతాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు వెళ్లాల్సిందే’ అని సింధు పేర్కొంది. అంచనాలను అందుకునే క్రమంలో ఒత్తిడి పెంచుకోనని కూడా సింధు అభిప్రాయపడింది.
‘నాపై ఎన్నో అంచనాలు ఉంటాయని నాకూ తెలుసు. అయితే ఒత్తిడి, విమర్శలు నాపై ప్రభావం చూపవు. నా టెక్నిక్‌లో కొన్ని లోపాలను సరిదిద్దుకోవడంపై దృష్టి పెట్టా. రెండో ఒలింపిక్ పతకం సాధించాలనే లక్ష్యంపైనే దృష్టి పెట్టా’ అని ఆమె చెప్పింది. ఈనెల 7న మొదలయ్యే మలేసియా మాస్టర్స్ ఓపెన్‌తో ఈ ఏడాదిని మొదలు పెట్టబోతున్న సింధు 20 నుంచి జరిగే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో కూడా ఆడనుంది. సైనా, శ్రీకాంత్‌వంటి షట్లర్లు పీబీఎల్‌కు దూరమైనా ఆమె మాత్రం టోర్నీ బరిలోకి దిగుతోంది. సొంత ప్రేక్షకులు, అభిమానుల సమక్షంలో ఆడటాన్ని తాను ఆస్వాదిస్తానని, పైగా యువ షట్లర్లకు స్ఫూర్తిగా నిలిచినట్లు కూడా ఉంటుంది కాబట్టి పీబీఎల్‌కు దూరం కానని ఈ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్‌కు ఆడనున్న సింధు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment