సిడ్నీ: విరాట్ కోహ్లి నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై 2018–19 టెస్టు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో కూడా నాలుగు టెస్టుల సిరీస్ కోసం భారత్ మళ్లీ పర్యటించాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో సిరీస్ జరుగుతుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అవసరమైతే ప్రేక్షకులు లేకుండానైనా దీనిని నిర్వహించాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో మైదానంలో ఉత్సాహానికి మారుపేరుగా నిలిచే విరాట్ కోహ్లి ప్రేక్షకులు లేని స్టేడియంలో ఎలా ఆడతాడనేది ఆసక్తికరమని ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ వ్యాఖ్యానించాడు. జనం లేనప్పుడు అతను ఎలా స్పందిస్తాడో చూడాలనుందని అన్నాడు. సహచర బౌలర్ మిషెల్ స్టార్క్‌తో సంభాషణ సందర్భంగా అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘మామూలుగానైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నా వాటికి అనుగుణంగా తనను తాను మార్చుకొని ఆడటం కోహ్లి శైలి.
అయితే స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా ఆడితే అతను ఎలా స్పందిస్తాడో చూడాలని ఉందంటూ నేను స్టార్క్‌తో చెప్పాను. ఖాళీ సీట్లను చూస్తే అతనిలో జోష్ పెరుగుతుందో లేదో? పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుందనేది వాస్తవం. అయితే విరాట్ సూపర్ స్టార్ కాబట్టి పరిస్థితులను తొందరగా అర్థం చేసుకోగలడేమో’ అని లయన్ అభిప్రాయపడ్డాడు. సొంతగడ్డపై భారత్‌ను మరోసారి ఎదుర్కొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నానని.... అయితే సిరీస్ ఎలాగైనా జరగాలనేదే తన కోరిక అని అతను అన్నాడు. ‘ప్రేక్షకుల సమక్షంలో ఆడాలా, లేదా అనేది మా చేతుల్లో లేదు. ఈ విషయంలో వైద్యుల సూచనలు పాటించాల్సిందే. కాబట్టి దాని గురించి ఆలోచించడం లేదు. భారత్‌తో ఆడటమన్నదే ముఖ్యం. గత సిరీస్‌లో వారు మమ్మల్ని ఓడించారు. అయితే ఇప్పుడు మా జట్టు చాలా పటిష్టంగా ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా మా రెండు టాప్ టీమ్‌లే తలపడాలని ఆశిస్తున్నా’ అని లయన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment