వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పాలి:అశ్విన్
ఆంటిగ్వా:వెస్టిండీస్ పర్యటనలో సెంచరీతో మెరిసిన భారత స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ తన ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లేలు తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడంతోనే సెంచరీ చేయడం సాధ్యమైందన్నాడు. తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చిన వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు. తాను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కంటే ముందు రావడంతోనే కెరీర్లో మూడో శతకం చేయడం సాధ్యపడిందన్నాడు.
'నేను టాప్-7లో బ్యాటింగ్ రావాలనే ఎప్పుడూ కోరుకుంటా. భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో ముందకొచ్చి సాధ్యమైనంతవరకూ బాగా ఆడాలనేది నా లక్ష్యం. నన్ను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసినందుకు కుంబ్లే, కోహ్లిలకు ప్రధానంగా ధన్యవాదాలు చెప్పాలి. నాపై నమ్మకం ఉంచి ఆర్డర్ మార్చడంతో సెంచరీ చేశా. గతంలో నేను కొన్ని మ్యాచ్ల్లో బాగా ఆడినా బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం అనేది ఇప్పుడే జరిగింది. నాకు ముందుగానే కోహ్లి విషయం చెప్పాడు. నీవు ఆరో స్థానంలో బ్యాటింగ్కు చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పాడు. అది నా బ్యాటింగ్ పై నమ్మకాన్ని పెంచింది'అని అశ్విన్ తెలిపాడు.