మెరిసింది ‘మన రాకెట్‌’ | Nehwal, PV Sindhu continue to hold India's fort in major tournaments | Sakshi
Sakshi News home page

మెరిసింది ‘మన రాకెట్‌’

Published Sun, Aug 27 2017 2:06 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

మెరిసింది ‘మన రాకెట్‌’

మెరిసింది ‘మన రాకెట్‌’

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదుగుతోందనే సంకేతాన్ని భారత స్టార్స్‌ మరోసారి ఇచ్చారు. గ్లాస్గో వేదికగా జరుగుతోన్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది.

తొలిసారి భారత్‌కు రెండు పతకాలు
సెమీస్‌లో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్‌ ∙
కాంస్య పతకంతో సంతృప్తి
మూడోసారి సెమీస్‌లోకి సింధు  
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌


అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత్‌ సూపర్‌ పవర్‌గా ఎదుగుతోందనే సంకేతాన్ని భారత స్టార్స్‌ మరోసారి ఇచ్చారు. గ్లాస్గో వేదికగా జరుగుతోన్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో భారత్‌ కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో భారత్‌కు తొలిసారి రెండు పతకాలు లభించనున్నాయి. మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు సెమీఫైనల్‌కు చేరుకొని పతకాలను ఖాయం చేసుకున్నారు. గాయం నుంచి కోలుకున్న సైనా అంచనాలకు మించి రాణించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకోగా... తెలుగు తేజం పీవీ సింధు మూడోసారి ఫైనల్‌ బెర్త్‌పై గురి పెట్టింది.

గ్లాస్గో (స్కాట్లాండ్‌): అంచనాలు నిజమయ్యాయి. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో ఈసారి భారత్‌ ఖాతాలో ఒకటికంటే ఎక్కువ పతకాలు చేరాయి. గత నాలుగు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఒక్కో పతకం గెలిచిన మన షట్లర్లు ఈసారి రెండు పతకాలతో మురిపించారు. మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు... హైదరాబాద్‌కే చెందిన సైనా నెహ్వాల్‌ సెమీఫైనల్‌కు చేరుకొని భారత్‌ కొత్త చరిత్ర సృష్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2015 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం గెలిచిన సైనా నెహ్వాల్‌ ఈసారి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ సైనా 21–12, 17–21, 10–21తో ప్రపంచ 12వ ర్యాంకర్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోవడంతో ఈ భారత స్టార్‌కు కాంస్య పతకం లభించింది.  

శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఒకుహారా గంటా 33 నిమిషాల్లో 21–18, 14–21, 21–15తో డిఫెండింగ్‌ చాంపియన్, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారిన్‌ (స్పెయిన్‌)పై సంచలన విజయం సాధించగా... సైనా 21–19, 18–21, 21–15తో క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)పై, నాలుగో సీడ్‌ పీవీ సింధు 21–14, 21–9తో ఐదో సీడ్‌ సున్‌ యు (చైనా)పై గెలుపొందారు. సింధు, చెన్‌ యుఫీ (చైనా)ల మధ్య రెండో సెమీఫైనల్‌ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో ఒకుహారా తలపడుతుంది.  

సూపర్‌ సింధు...
2013, 2014 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలిచిన సింధు ఈసారీ సెమీఫైనల్‌కు చేరుకొని తన ఖాతాలో మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాన్ని వేసుకుంది. ఎన్గాన్‌ యి చెయుంగ్‌ (వియత్నాం)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అతికష్టమ్మీద గట్టెక్కిన సింధు... సున్‌ యుతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో మాత్రం తన విశ్వరూపం ప్రదర్శించింది. కేవలం 39 నిమిషాల్లో సున్‌ యు ఆట కట్టించిన సింధు ఏదశలోనూ ఈ చైనా స్టార్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. గత ఏడాది వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో సున్‌ యు చేతిలో వరుస గేముల్లో ఓడిపోయిన ఈ హైదరాబాద్‌ అమ్మాయి తాజా విజయంతో ఆ ఓటమికి బదులు తీర్చుకుంది.  

శ్రీకాంత్‌కు నిరాశ
ప్రపంచ చాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు పతకం వచ్చి 31 ఏళ్లు గడిచాయి. ఈ ఏడాది అద్వితీయమైన ఫామ్‌లో ఉన్న కిడాంబి శ్రీకాంత్‌ ఈ నిరీక్షణకు తెరదించుతాడని ఆశించినా నిరాశే ఎదురైంది. టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 14–21, 18–21తో ఓడిపోయాడు.

ఒత్తిడికి లోనై...
గతంలో ఒకుహారాతో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరుసార్లు గెలుపొందిన సైనా ఈసారి మాత్రం తన ప్రత్యర్థి పోరాటపటిమ ముందు ఎదురు నిలువలేకపోయింది. గంటా 14 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా 22 నిమిషాల్లో తొలి గేమ్‌ను దక్కించుకుంది. అయితే రెండో గేమ్‌లో భారత స్టార్‌ తడబడింది. స్కోరు 17–17 వద్ద సైనా ఒత్తిడికిలోనై వరుసగా నాలుగు పాయింట్లు చేజార్చుకొని గేమ్‌ను కోల్పోయింది. తొలి రెండు గేముల్లో నెట్‌ వద్ద, సుదీర్ఘ ర్యాలీల్లో సైనా పలుమార్లు పైచేయి సాధించినా... మూడో గేమ్‌లో మాత్రం ఒకుహారా ఆటతీరుకు సైనా వద్ద సమాధానం లేకపోయింది. మొదట్లో సైనా 3–1తో ఆధిక్యంలోకి వెళ్లినా... ఒకుహారా తన వ్యూహాలు మార్చి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 6–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఒకుహారా మరింత జోరు పెంచగా... సైనా డీలా పడింది. ఒకదశలో ఒకుహారా 16–7తో తొమ్మిది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. సైనా తేరుకునేందుకు ప్రయత్నం చేసినా ఒకుహారా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement