11 సిక్సర్లు, 9 ఫోర్లతో చెలరేగినా..
ఆక్లాండ్:చాపెల్-హ్యాడ్లీ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా పోరాడి ఓడింది. న్యూజిలాండ్ విసిరిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆసీస్ 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయినప్పటికీ మార్కస్ స్టోయినిస్(146 నాటౌట్;117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. తన కెరీర్లో రెండో వన్డే ఆడుతున్న స్టోయినిస్ చెలరేగి ఆడాడు. బౌండరీలే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. అయినప్పటికీ జట్టును విజయ తీరాలకు మాత్రం చేర్చలేకపోయాడు. అతనికి సరైన సహకారం లేకపోవడంతో ఆసీస్ ఇంకా మూడు ఓవర్లు మిగిలి ఉండగానే వికెట్లను కోల్పోయి పరాజయం చెందింది. ఆసీస్ ఇన్నింగ్స్ 47.0 ఓవర్ చివరి బంతికి హజల్ వుడ్ రనౌట్ కావడంతో ఆసీస్ కు ఓటమి తప్పలేదు. దాంతో స్టోయినిస్ శ్రమ వృథా ప్రయాసగానే మిగిలింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.గప్టిల్ (61), బ్రూమ్(73), నీషమ్(48), విలియమ్సన్(24)లు ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోరును ఆసీస్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో విజయంతో న్యూజిలాండ్ 1-0 తో ఆధిక్యం సాధించింది.