
జొకోవిచ్, సెరెనాలకు టాప్ సీడింగ్
త్వరలో ప్రారంభం కానున్నఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్స్ నొవాక్ జొకోవిచ్ , సెరెనా విలియమ్స్ లు టాప్ సీడ్ గా బరిలోకి దిగుతున్నారు.
మెల్ బోర్న్: త్వరలో ప్రారంభం కానున్నఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్స్ నొవాక్ జొకోవిచ్ , సెరెనా విలియమ్స్ లు టాప్ సీడ్ గా బరిలోకి దిగుతున్నారు. మరోవైపు 17 గ్రాండ్ స్లామ్స్ గెలిచిన రోజర్ ఫెదరర్ మూడో సీడ్ గా పోరుకు సిద్ధమవుతుండగా, బ్రిటీష్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు రెండో సీడ్, 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, స్విస్ ఆటగాడు స్టాన్ వావ్రింకాకు నాల్గో సీడింగ్ లభించింది.
మహిళల విభాగంలో సిమోన్ హెలెప్ రెండో సీడ్ గా, గార్బైన్ ముగురుజ్జా మూడో సీడ్, రద్వాన్ స్కాకు నాల్గో సీడ్, రష్యా టెన్నిస్ అందాల తార మారియా షరపోవా ఐదో సీడ్ గా ఆస్ట్రేలియా ఓపెన్ లో పోరుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, ఇటీవల బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ గెలిచిన విక్టోరియా అజరెంకా తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకోవడంతో 14వ సీడ్ లభించింది. జనవరి 18వ తేదీ నుంచి ఆరంభం కానున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ కు ఆటగాళ్ల ప్రస్తుత ర్యాంకులు ఆధారంగా సీడింగ్ కేటాయించారు.