
ముంబై: భారత క్రీడల క్యాలెండర్‌లో వాలీబాల్ లీగ్ చేరింది. కొత్తగా ప్రొ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ లీగ్‌ను ఈ ఏడాదే నిర్వహించేందుకు భారత వాలీబాల్ సమాఖ్య (వీఎఫ్‌ఐ) ప్రణాళికలు సిద్ధం చేసింది. జకార్తాలో ఆగస్టులో జరిగే ఆసియా క్రీడల తర్వాత పీవీఎల్ నిర్వహిస్తామని వీఎఫ్‌ఐ వర్గాలు తెలిపాయి. భారత్‌లో వాలీబాల్‌కు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు, ఆటను మరో దశకు తీసుకెళ్లేందుకు ఈ లీగ్ దోహదం చేయగలదని ప్రొ వాలీబాల్ లీగ్ సీఈఓ జోయ్ భట్టాచార్య వెల్లడించారు. ఆరు ఫ్రాంచైజీలు ఇందులో పాల్గొంటాయి. ఆసక్తిగలవారు రెండు ఫ్రాంచైజీల కోసం బిడ్లు దాఖలు చేయొచ్చు. ఫైనల్‌గా ఒక ఫ్రాంచైజీని మాత్రమే కేటాయిస్తారు.
మంగళవారం నుంచి బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం జూలైలో ఆటగాళ్ల వేలం ఉంటుంది. భారత్‌కు చెందిన 90 మంది ఆటగాళ్లను వేలంలో కొనొచ్చు. కానీ విదేశీ ఆటగాళ్లను మాత్రం ముందస్తు ఒప్పందం ద్వారా ఎంపిక చేసుకుంటారు. ఉత్తర, దక్షిణ భారత్‌లోని కేవలం రెండు వేదికల్లోనే 18 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. నిజానికి వాలీబాల్ లీగ్ ఇప్పుడే కొత్తకాదు. 2011లోనే భారత వాలీబాల్ సమాఖ్య ఆధ్వర్యంలోనే ఇండియన్ వాలీబాల్ లీగ్ (ఐవీఎల్) జరిగింది. అప్పుడు కూడా ఆరు ఫ్రాంచైజీలు పాల్గొనగా చెన్నై టైటిల్ గెలిచింది. కానీ ఇది ఏమాత్రం ఆదరణకు నోచుకోకపోవడంతో మొదటి సీజనే ఆఖరిదైంది.
Comments
Please login to add a commentAdd a comment