దమ్ము కొట్టి... | One Year Of England Cricket World Cup Win | Sakshi
Sakshi News home page

దమ్ము కొట్టి...

Published Wed, Jul 15 2020 2:24 AM | Last Updated on Wed, Jul 15 2020 2:24 AM

One Year Of England Cricket World Cup Win - Sakshi

లండన్‌: సరిగ్గా ఏడాది క్రితం ఇంగ్లండ్‌ జట్టు తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగి, సూపర్‌ ఓవర్‌ కూడా సమమై, చివరకు బౌండరీ లెక్కతో న్యూజిలాండ్‌ ఓడిన ఫైనల్లో స్టోక్స్‌ కీలకపాత్ర పోషించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ప్రధాన పోరులో 84 పరుగులతో అజేయంగా నిలిచిన అతను సూపర్‌ ఓవర్‌లో కూడా బ్యాటింగ్‌కు దిగాడు. అయితే ఈ రెండింటి మధ్య స్టోక్స్‌ తీవ్ర ఉత్కంఠను అనుభవించాడు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు దమ్ము కొట్టడం తప్ప అతనికి మరో మార్గం కనిపించలేదట. ఇంగ్లండ్‌ విజయం గురించి వచ్చిన కొత్త పుస్తకం ‘మోర్గాన్స్‌ మెన్‌ –ద ఇన్‌సైడ్‌ స్టోరీ ఆఫ్‌ ఇంగ్లండ్స్‌ రైజ్‌ ఫ్రమ్‌ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ హ్యూమిలియేషన్‌ టు వరల్డ్‌కప్‌ గ్లోరీ’లో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి.

‘ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత మైదానం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లే వరకు కెమెరా కళ్లు, 27 వేల మంది ప్రేక్షకుల అంచనాలు అతని మీదే ఉన్నాయి. గదిలో మోర్గాన్‌ తదుపరి వ్యూహం గురించి మాట్లాడుతుంటే స్టోక్స్‌ తనకు కాస్త ప్రశాంతత కావాలని పక్కకు వెళ్లిపోయాడు. అప్పటికే తీవ్ర ఒత్తిడిలో అతను రెండున్నర గంటలు బ్యాటింగ్‌ చేశాడు. సహచరులకు దూరంగా ఒంటరిగా వెళ్లి సిగరెట్‌ తాగిన తర్వాత మళ్లీ ఉత్సాహంతో వచ్చాడు’ అని పుస్తక రచయితలు నిక్‌ హాల్ట్‌–స్టీవ్‌ జేమ్స్‌ వెల్లడించారు. మరోవైపు కెప్టెన్‌ మోర్గాన్‌ నాటి మ్యాచ్‌లో ఒక కీలక క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు. నీషమ్‌ బౌలింగ్‌లో స్టోక్స్‌ బంతిని గాల్లోకి లేపగా అతను కచ్చితంగా అవుట్‌గానే భావించానని, అప్పుడే తమ పని ముగిసిపోయినట్లు అనిపించిందని (ఈ షాట్‌ సిక్సర్‌గా మారింది) మోర్గాన్‌ అన్నాడు. తన దృష్టిలో ఈ విజయం క్రికెట్‌కంటే గొప్పదని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement