
పాక్ బోణీ:7 వికెట్ల తేడాతో యూఏఈపై గెలుపు
మిర్పూర్: ఆసియాకప్లో భాగంగా యూఏఈతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల గెలుపుతో బోణీ కొట్టింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 18.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్(50; 46 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) 8వ టీ20 హాఫ్ సెంచరీ చేశాడు. షోయబ్ మాలిక్ (63; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు) ఫోర్ కొట్టి పాక్ కు గెలుపునందించాడు. మాలిక్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. యూఏఈ బౌలర్లలో అంజాద్ మాత్రమే రాణించి మూడు వికెట్లు తీయగా, మిగతా బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు.
పాక్ ను హడలెత్తించాడు
యూఏఈ బౌలర్ అంజాద్ జావేద్ పాక్ టాపార్డన్ కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి పాక్ ఓపెనర్ షార్జిల్ ఖాన్(4) ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అదే ఓవర్ ఐదో బంతికి ఖుర్రం మంజూర్(0)ను వెనక్కి పంపాడు. తాను ఎదుర్కొన్న రెండో బంతికే కీపర్ క్యాచ్ ఇచ్చి మంజూర్ ఔటయ్యాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో మరోసారి పాక్ ను దెబ్బకొట్టాడు. నాలుగో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ మహమ్మద్ హఫీజ్(11)ను కూడా త్వరగానే ఇంటిదారి పట్టించి పాక్ ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో పాక్ 17 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మన్స్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మిగతా బౌలర్ల నుంచి సహకారం లేకపోవడంతో మాలిక్, ఉమర్ అక్మల్ లు నాలుగో వికెట్ కు 114 పరుగుల భారీ భాగస్వాయ్యాన్ని నెలకొల్పారు. టీ20 లలో నాలుగో వికెట్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూఏఈ ఆదిలో తడబడినా తరువాత పుంజుకుంది. 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో షైమాన్ అన్వర్(46;42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు. ఆ తరువాత ముహ్మాద్ ఉస్మాన్(21),అమ్ జాద్ జావెద్ (27 నాటౌట్) సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో యూఏఈ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో ఆమిర్, ఇర్ఫాన్లు తలో రెండు వికెట్లు సాధించగా, ఆఫ్రిది, సమీలకు చెరో వికెట్ దక్కింది. మంగళవారం భారత్, శ్రీలంకలు తలపడతున్నాయి.