జొహన్నెస్‌బర్గ్: పాకిస్తాన్ బౌలర్లు తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఆదివారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో పాక్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ‘పింక్ వన్డే’లో గతంలో ఆడిన ఏడు సార్లూ గెలిచిన సఫారీ జట్టుకు తొలిసారి పరాజయం ఎదురైంది. ముందుగా దక్షిణాఫ్రికా 41 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా (59; 7 ఫోర్లు), డు ప్లెసిస్ (57; 5 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలు సాధించారు. ఆరు బంతుల వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఉస్మాన్ షిన్వారి (4/35) దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. షాహిన్ ఆఫ్రిది, షాదాబ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం పాక్ 31.3 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు సాధించింది.ఇమామ్ ఉల్ హఖ్ (71; 6 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా...ఫఖర్ జమాన్ (44; 7 ఫోర్లు), బాబర్ ఆజమ్ 41 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. ప్రస్తుతం సిరీస్ 2–2తో సమంగా నిలవగా, చివరి వన్డే బుధవారం జరుగుతుంది.
సర్ఫరాజ్‌పై 4 మ్యాచ్‌ల నిషేధం
దక్షిణాఫ్రికా ఆటగాడు ఆండిల్ ఫెలుక్‌వాయోపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి 4 మ్యాచ్‌ల నిషేధం విధించింది. ఫలితంగా అతను ఈ సిరీస్‌లో రెండు వన్డేలతో పాటు టి20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నాలుగో వన్డేలో షోయబ్ మాలిక్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఐసీసీ చర్యపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అసంతృప్తి వ్యక్తం చేసింది. సదరు ఘటనపై సర్ఫరాజ్ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు ఫెలుక్‌వాయోను కూడా వ్యక్తిగతంగా కలిసి మన్నించమని కోరిన విషయాన్ని గుర్తు చేసింది. తాము సర్ఫరాజ్‌ను క్షమించినట్లు డు ప్లెసిస్ చెప్పినా ఐసీసీ ఇంత తీవ్రంగా స్పందించడంతో నిరాశ చెందామని పీసీబీ అధికారులు వ్యాఖ్యానించారు.
పాకిస్తాన్ ఘన విజయం
Published Mon, Jan 28 2019 1:31 AM | Last Updated on Mon, Jan 28 2019 1:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment