
కాల్గరీ: కెనడా ఓపెన్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఆరో సీడ్ కశ్యప్ 21–12, 21–17తో ల్యుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై ఘన విజయం సాధించగా... జాతీయ చాంపియన్ సౌరభ్ 21–14, 21–11 తేడాతో బీఆర్ సంకీర్త్ (కెనడా)ను చిత్తు చేశాడు. తర్వాతి మ్యాచ్‌లలో రెన్ పెంగ్ బో (చైనా)తో కశ్యప్, సున్ ఫీ జియాంగ్ (చైనా)తో సౌరభ్ తలపడతారు. టోర్నీలో ఇతర భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ మాత్రం ఓటమితో నిష్క్రమించారు. జయరామ్ 19–21, 17–21 స్కోరుతో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. జపాన్‌కు చెందిన కోకి వతనబే 21–16, 21–10తో ప్రణయ్‌ను... వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) 21–7, 21–13తో లక్ష్య సేన్‌ను పరాజయం పాల్జేశారు.
Comments
Please login to add a commentAdd a comment