అడుగు దూరంలో...
ఫైనల్లో కశ్యప్
జ్వాల జోడి కూడా
సింధుకు కాంస్యం
గ్లాస్గో: భారత స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్... కామన్వెల్త్ గేమ్స్‌లో చరిత్రాత్మక విజయానికి అడుగు దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ కశ్యప్ 18-21, 21-17, 21-18తో ప్రపంచ 26వ ర్యాంకర్ రాజీవ్ ఊసెప్ (ఇంగ్లండ్)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. 83 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరు ప్లేయర్లు సుదీర్ఘ ర్యాలీలతో ఆకట్టుకున్నారు. తొలి గేమ్‌ను కోల్పోయిన భారత కుర్రాడు తర్వాతి రెండు గేమ్‌ల్లో పోరాట పటిమను ప్రదర్శించాడు. 34 నిమిషాల పాటు జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో 71 స్ట్రోక్స్ నమోదయ్యాయి.
ఆదివారం జరిగే ఫైనల్లో కశ్యప్... డెరెక్ వాంగ్ (సింగపూర్)పై గెలిస్తే 32 ఏళ్ల తర్వాత పురుషుల విభాగంలో స్వర్ణం గెలిచిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. మహిళల డబుల్స్ సెమీస్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప 21-7, 21-12తో లా పి జింగ్-లూ యిన్ లిమ్ (మలేసియా)ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించారు. ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో 27 నిమిషాల్లోనే ప్రత్యర్థుల ఆట కట్టించారు. ప్రత్యర్థుల సర్వీస్‌లో 16 పాయింట్లు రాబట్టిన భారత ద్వయం... తమ సర్వీస్‌లో 26 పాయింట్లు నెగ్గారు. సుదీర్ఘ ర్యాలీలతో పాటు షార్ట్ వ్యాలీలతో ఆకట్టుకున్నారు.
సింధు, గురు సాయిదత్‌లకు కాంస్యాలు
తొలిసారి కామన్వెల్త్ గేమ్స్ ఆడిన హైదరాబాద్ అమ్మాయి పి.వి.సింధు కాంస్యం గెలుచుకుంది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో 23-21, 21-9తో జింగ్ యీ టీ (మలేసియా)పై నెగ్గింది. 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి సింధుకు గట్టిపోటీ ఎదురైంది. సింగిల్ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడటంతో ఓ దశలో 19-19, 20-20, 21-21తో సమమైంది. అయితే రెండు బలమైన క్రాస్ షాట్లతో సింధు గేమ్‌ను ముగించింది. రెండో గేమ్‌లో జింగ్ నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో 11-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో హైదరాబాదీ 6 పాయింట్లు చేజార్చుకున్నా.. మళ్లీ పుంజుకుని వరుస పాయింట్లతో గేమ్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
అంతకుముందు సెమీస్‌లో సింధు 20-22, 20-22తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో పోరాడి ఓడింది. పురుషుల కాంస్య పతక పోరులో ఆర్.ఎం.వి.గురుసాయిదత్ 21-15, 14-21, 21-19తో రాజీవ్ ఊసెఫ్ (ఇంగ్లండ్)పై నెగ్గాడు. రెండో గేమ్ కోల్పోయిన భారత ప్లేయర్ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో గట్టిగా పోరాడాడు. ఆరంభంలో 7-8తో వెనుకబడ్డా పుంజుకుని 11-11తో సమం చేశాడు. ఆ తర్వాత నాలుగు పాయింట్లు నెగ్గి 16-12 స్కోరుతో నిలిచాడు. తర్వాత ఇక వెనుదిరిగి చూడలేదు.