అతడి రాకతో జట్టు మరింత పటిష్టం: స్మిత్
సిడ్నీ: వరుస ఓటములతో కుంగిపోతున్న ఆస్ట్రేలియా జట్టు గాడిన పడాలంటే మెరుగైన జట్టు ఉండాలని కెప్టెన్ స్టీవ్ స్మిత్ డిసైడ్ అయ్యాడు. దక్షిణాఫ్రికాతో రేపు(గురువారం) జరగనున్న తొలి టెస్టు ద్వారా అరంగేట్రం చేయాలనుకున్న జోయ్ మెన్నీకి నిరాశే ఎదురైంది. కొత్త ఆటగాడు జోయ్ మెన్నీని, సీనియర్ బౌలర్ పీటర్ సిడిల్ లలో ఎవరికి జట్టులో చోటివ్వాలా అని ఆసీస్ క్రికెట్ బోర్డు కూడా ఆలోచించింది. చివరికి అనుభవం ఉన్న సిడిల్ కు అవకాశం ఇచ్చింది.
ఇటీవల జరిగిన వరుస సిరీస్ ఓటములతో ఆసీస్ ఆత్మస్థైర్యంలో కాస్త వెనుకంజ వేసింది. మొదట లంక గడ్డపై 3-0తో వైట్ వాష్ కు గురైంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో తమ వన్డే చరిత్రలోనే తొలిసారిగా 5-0తో దారుణ ఓటమిని మూటగట్టుకుంది ఆసీస్. తొమ్మిది నెలల కిందట న్యూజిలాండ్ తో సిరీస్ సందర్భంగా గాయపడి జట్టుకు దూరమైన సిడిల్ రావడంతో ఆసీస్ పేస్ విభాగం బలోపేతమవుతోంది. సిడిల్ తో పాటు గాయాల నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్, హజెల్ వుడ్ తమ బెస్ట్ ఆప్షన్స్ అని క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. మరోవైపు వన్డేల్లో ఆసీస్ కు వరుస ఓటములను చూపించిన సఫారీలు.. టెస్టు సిరీస్ లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు.