ప్రజ్ఞాన్ ఓజా కనిపించడం లేదు!
కోల్‌కతా: క్రికెట్ జట్టు ప్రకటనలో ఇది అనూహ్యం! ఒక ఆటగాడు తమ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అందుబాటులో రావడం లేదంటూ అతని పేరు లేకుండా జట్టును ప్రకటించడం ఆశ్చర్యపరిచే పరిణామం. తనను హైదరాబాద్‌కు తిరిగి ఆడకుండా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అడ్డుకుందనే ఆవేదనలో ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చివరకు అధికారులెవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఫలితంగా గుజరాత్‌తో వార్మప్ మ్యాచ్‌ల కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. ‘ఓజాతో మాట్లాడాలని మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను అందుబాటులోకే రాలేదు.
దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓజా పేరు లేకుండానే జట్టును ఎంపిక చేశాం’ అని క్యాబ్ సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు. వాస్తవానికి రెండు వారాల క్రితమే బెంగాల్ జట్టు ప్రత్యేక శిక్షణా శిబిరం ప్రారంభమైనా... దానికి కూడా ఓజా ఇప్పటి వరకు హాజరు కాలేదు. గత రెండు సీజన్ల పాటు బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించిన ఓజా...ఈసారి సొంత టీమ్ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడాలని ఆశించాడు. అయితే తమకు ఓజా అవసరం ఉందంటూ ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనికి నిరభ్యంతరకర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేయలేదు.