
పంజాబ్ కింగ్స్ బోణి
మొహాలీ: ఐపీఎల్-7లో వీర బాదుడుకు పర్యాయంగా నిలిచిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ (25 బంతుల్లో 43; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మరోసారి తన పవర్ చూపించాడు. లక్ష్యం చిన్నదే అయినా నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయిన జట్టును తనకే సాధ్యమైన ఆటతీరుతో గట్టెక్కించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా, బెయిలీ (27 బంతుల్లో 34 నాటౌట్; 5 ఫోర్లు) చివర్లో చెలరేగడంతో చాంపియన్స్ లీగ్‌లో తొలిసారిగా ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు శుభారంభం చేసింది. పీసీఏ స్టేడియంలో గురువారం హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో బెయిలీ సేన ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. వెల్స్ (18 బంతుల్లో 28; 5 ఫోర్లు), బిర్ట్ (21 బంతుల్లో 28; 1 ఫోర్; 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. బౌలింగ్‌లో పెరీరా (2/17) రాణించాడు. అనంతరం పంజాబ్ 17.4 ఓవర్లలో 5 వికెట్లకు 146 పరుగులు చేసి నెగ్గింది.
నెమ్మదిగా ఆరంభం
హరికేన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే నెమ్మదిగా సాగింది. ఐదో ఓవర్‌లో కెప్టెన్ పైన్ (16 బంతుల్లో 11; 1 ఫోర్)ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో ఓపెనర్ డంక్ మూడు ఫోర్లతో రెచ్చిపోయినా ఎనిమిదో ఓవర్‌లో పెరీరాకు దొరికిపోయాడు. పంజాబ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మిడిల్ ఓవర్లలోనూ హరికేన్ బ్యాట్స్‌మెన్ పరుగులు తీసేందుకు ఇబ్బందిపడ్డారు. అటు వరుస ఓవర్లలో బ్లిజార్డ్, షోయబ్ మాలిక్ (14 బంతుల్లో 14; 1 ఫోర్) అవుట్ కావడంతో స్కోరు మరింత నెమ్మదించింది. చివర్లో బౌలర్లు మంచి బంతులు వేయడంతో భారీ స్కోరు సాధ్యపడలేదు.
తొలి బంతికే ఝలక్
పంజాబ్ బ్యాటింగ్‌లో బొలింజర్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే వీరేంద్ర సెహ్వాగ్ అవుటై నిరాశపరిచాడు. తన మరుసటి ఓవర్‌లోనే సాహా (9 బంతుల్లో 11; 1 ఫోర్)ను కూడా బొలింజర్ పెవిలియన్ పంపించాడు. మిల్లర్ డకౌట్‌తో 23 పరుగులకే మూడు వికెట్లు పోవడంతో పంజాబ్ శిబిరంలో ఆందోళన నెలకొన్నా మ్యాక్స్‌వెల్ ఆ పరిస్థితిని మార్చాడు. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్స్‌గా మలిచిన ఈ డాషింగ్ ఆటగాడు ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. అయితే బోయ్స్ వేసిన 9వ ఓవర్‌లో 6,4తో అదరగొట్టి జోరు చూపిస్తున్న వేళ గల్బిస్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే బెయిలీ, పెరీరా వేగంగా ఆడి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశారు.
స్కోరు వివరాలు
హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్: డంక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) పెరీరా 26; పైన్ (బి) పటేల్ 11; బ్లిజార్డ్ (సి) అవానా (బి) పెరీరా 27; షోయబ్ (సి) బె యిలీ (బి) కరణ్‌వీర్ 14; బర్ట్ (సి) కరణ్‌వీర్ (బి) అవానా 28; వెల్స్ (రనౌట్) 28; గల్బిస్ నాటౌట్ 6; హిల్ఫెన్హాస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (4); మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 144.
వికెట్ల పతనం: 1-15; 2-43; 3-71; 4-78; 5-130; 6-143.
బౌలింగ్: అనురీత్ సింగ్ 4-0-25-0; అవానా 4-0-25-1; పటేల్ 4-0-20-1; సెహ్వాగ్ 1-0-8-0; పెరీరా 3-0-17-2; మ్యాక్స్‌వెల్ 1-0-9-0; కరణ్‌వీర్ సింగ్ 3-0-37-1.
పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) బోయ్స్ (బి) బొలింజర్ 0; వోహ్రా (సి) హిల్ఫెన్హాస్ (బి) లాగ్లిన్ 18; సాహా (సి) షోయబ్ (బి) బొలింజర్ 11; మిల్లర్ (సి) బోయ్స్ (బి) హిల్ఫెన్హాస్ 0; మ్యాక్స్‌వెల్ (సి) పైన్ (బి) గల్బిస్ 43; బెయిలీ నాటౌట్ 34; పెరీరా నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు (5); మొత్తం (17.4 ఓవర్లలో 5 వికెట్లకు) 146.
వికెట్ల పతనం: 1-0; 2-21; 3-23; 4-51; 5-77.
బౌలింగ్: బొలింజర్ 4-0-30-2; హిల్ఫెన్హాస్ 4-0-30-1; బోయ్స్ 3-0-36-0; లాగ్లిన్ 4-0-26-1; గల్బిస్ 2.4-0-23-1.