వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌ | Lizelle Lee Scored Back To Back Centuries In WBBL | Sakshi
Sakshi News home page

వరుస సెంచరీలు.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్‌

Nov 13 2024 3:15 PM | Updated on Nov 13 2024 3:29 PM

Lizelle Lee Scored Back To Back Centuries In WBBL

మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో హోబర్ట్‌ హరికేన్స్‌ ఓపెనర్‌, సౌతాఫ్రికా ప్లేయర్‌ లిజెల్‌ లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో అరివీర భయంకమైన ఫామ్‌లో ఉన్న లీ.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు విధ్వంసకర సెంచరీలు చేసింది. తొలుత పెర్త్‌ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో​ 75 బంతుల్లో అజేయమైన 150 పరుగులు (12 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసిన లీ.. తాజాగా అడిలైడ్‌ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు సెంచరీతో (59 బంతుల్లో 103; 13 ఫోర్లు, 4 సిక్సర్లు) విజృంభించింది. తద్వారా మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌ చరిత్రలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది.

కొడితే బ్యాట్‌ విరిగిపోయింది..!
ఈ మ్యాచ్‌లో లిజెల్‌ కొట్టిన ఓ షాట్‌కు బ్యాట్‌ విరిగిపోయింది. ఓర్లా వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ రెండో బంతికి లిజెల్‌ క్రీజ్‌ వదిలి ముందుకు వచ్చి భారీ షాట్‌ ఆడింది. ఈ షాట్‌కు బ్యాట్‌ విరిగిపోయినప్పటికీ బంతి బౌండరీని క్లియర్‌ చేసింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హరికేన్స్‌.. లిజెల్‌ మెరుపు సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. లిజెల్‌కు నికోలా క్యారీ (46 బంతుల్లో 64 నాటౌట్‌;  7 ఫోర్లు, సిక్స్‌) సహకరించింది. హరికేన్స్‌ ఇన్నింగ్స్‌లో వ్యాట్‌ హాడ్జ్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ ఎలైస్‌ విల్లాని 14 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. అడిలైడ్‌ బౌలర్లలో మెగాన్‌ షట్‌కు ఓ వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో లిజెల్‌ రనౌటయ్యింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ 15 ఓవర్ల అనంతరం మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. స్మృతి మంధన (32 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో కదంతొ​క్కగా..  కేటీ మ్యాక్‌ 14, తహిళ మెక్‌గ్రాత్‌ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. లారా వోల్వార్డ్ట్‌ (25), బ్రిడ్జెట్‌ ప్యాటర్సన్‌ (11) క్రీజ్‌లో ఉన్నారు. హరికేన్స్‌ బౌలర్లలో మోల్లీ స్ట్రానో, లారెన్‌ స్మిత్‌, యామీ స్మిత్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అడిలైడ్‌ గెలవాలంటే 30 బంతుల్లో మరో 80 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement