బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్లోకి హోబర్ట్ హరికేన్స్ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
ఓపెనర్ మిచెల్ ఓవెన్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్ జువెల్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్ మెక్‌డెర్మాట్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు.
మథ్యూ వేడ్ 7 బంతుల్లో 4, నిఖిల్ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్ జోర్డన్ 3 బంతుల్లో 2 (నాటౌట్), కెప్టెన్ నాథన్ ఇల్లిస్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్ సిల్క్ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్ షా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేశారు.
అయితే హరికేన్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్ ఇల్లిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటర్లు జోష్ ఫిలిప్ (0), జాక్ ఎడ్వర్డ్ (0), కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ (1) దారుణంగా విఫలమయ్యారు.
పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్‌బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్ విజేతతో హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment