పూర్ణిమా రావుకు షాక్
⇒భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవి నుంచి తొలగింపు
⇒కొత్త కోచ్‌గా తుషార్ అరోథే
హైదరాబాద్: మరో రెండు నెలల్లో జరిగే ప్రపంచ కప్‌కు భారత మహిళల క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న దశలో జట్టు కోచ్ విషయంలో బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి పూర్ణిమా రావును తప్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. పూర్ణిమ స్థానంలో బరోడా మాజీ క్రికెటర్ తుషార్ అరోథేను బోర్డు ఎంపిక చేసింది. పూర్ణిమ కోచ్‌గా ఉన్న సమయంలోనే వరల్డ్ కప్‌కు భారత జట్టు అర్హత సాధించగా... ఇప్పుడు ప్రధాన టోర్నీకి ముందు ఆమెను తొలగించడం ఊహించని పరిణామం. బీసీసీఐ దీనికి సంబంధించి పూర్ణిమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తనను తప్పిస్తున్నట్లు ఆమెకు కూడా మీడియా ద్వారానే తెలిసింది. కీలక సమయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేమిటనే దానిపై స్పష్టత లేదు. 114 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తుషార్‌కు ఇంతకుముందు భారత మహిళల జట్టుకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది.
నన్ను అవమానించారు...
హైదరాబాద్‌కు చెందిన పూర్ణిమా రావు భారత్ తరఫున 5 టెస్టులు, 33 వన్డేలు ఆడారు. తొలిసారి 2014 ఫిబ్రవరిలో భారత్ కోచ్ పదవి చేపట్టారు. అయితే టి20 ప్రపంచకప్‌లో జట్టు విఫలమైన తర్వాత ఆమెపై వేటు పడింది. ఆ తర్వాత జూన్ 2015 నుంచి రెండోసారి ఆమె కోచ్‌గా కొనసాగుతున్నారు. పూర్ణిమ కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్‌లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బ్యాంకాక్‌లో ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఇటీవలే క్వాలిఫయర్స్‌లో విజేతగా నిలిచి వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘కోచ్‌గా నేను చాలా మంచి ఫలితాలు సాధించాను. గత రెండేళ్లలో ఎనిమిది సిరీస్ విజయాల్లో భాగంగా ఉన్నాను. కనీస సమాచారం లేకుండా, నాకు మాట మాత్రం చెప్పకుండా నన్ను తొలగించారు. ప్రపంచకప్‌కు కొద్ది రోజుల ముందు ఒక విజయవంతమైన టీమ్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే దేశం గురించి, జట్టు గురించి మీరు ఏ మాత్రం ఆలోచించడం లేదని అర్థం. ఈ చర్య జట్టుపై ప్రభావం చూపించరాదని కోరుకుంటున్నాను’ అని పూర్ణిమా రావు వ్యాఖ్యానించారు.
ప్రపంచకప్‌లో జట్టు బాగా ఆడేందుకు తాము అనేక ఆలోచనలు, వ్యూహాలతో తలమునకలై ఉన్న దశలో ఇలాంటి పరిణామంతో తాను నిర్ఘాంతపోయానని ఆమె అన్నారు. ‘బోర్డు నాకు ఎంత మొత్తం చెల్లించినా ఎప్పుడూ అసంతృప్తికి గురి కాలేదు. ఇచ్చిందే తీసుకున్నాను. నన్ను తప్పించేం దుకు బీసీసీఐ ఎలాంటి కారణం చెప్పలేదు. కనీసం నాకు సమాచారం ఇచ్చే ధైర్యం కూడా వారికి లేదు. జట్టు ఓడినప్పుడు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు గెలిచాక పొమ్మంటున్నారు. ఇది నన్ను తీవ్రంగా నిరాశపర్చడమే కాదు. అవమానించినట్లుగా భావిస్తున్నా’ అని పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు.