క్వార్టర్స్‌లో సింధు | PV Sindhu Advances to Quarters of Swiss Open | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు

Published Fri, Mar 18 2016 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM

క్వార్టర్స్‌లో సింధు

క్వార్టర్స్‌లో సింధు

ప్రణీత్, సమీర్‌కు చుక్కెదురు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్
 
బాసెల్: భారత బ్యాడ్మింటన్ స్టార్ షట్లర్ పి.వి.సింధు.. స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరోసీడ్ సింధు 21-16, 21-16తో యు పో పాయ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. 36 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో... హైదరాబాదీ స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. తొలి గేమ్ ఆరంభంలో పాయ్ మెరుగ్గా ఆడింది. అయితే స్కోరు 7-7తో సమమైన తర్వాత సింధు ఇక వెనుదిరిగి చూడలేదు. ప్రత్యర్థికి పెద్దగా అవకాశం ఇవ్వకుండా ఒకటి, రెండు పాయింట్లతో ఆధిక్యాన్ని చూపెట్టింది.

చివరకు 18-16 ఉన్న దశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఇద్దరు క్రీడాకారిణిలు పాయింట్ల కోసం హోరాహోరీగా తలపడ్డారు. 8-7 ఆధిక్యంలో ఉన్న దశలో సింధు ఆరు పాయింట్లు నెగ్గితే.. ఆ వెంటనే యు పో ఏడు పాయింట్లు సాధించింది. స్కోరు 15-15తో సమమైన తర్వాత యు పో ఒక్క పాయింట్‌కు పరిమితంకాగా, ఆరు పాయింట్లు సాధించి గేమ్, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 19-21, 6-21తో రెండోసీడ్ చో టియాన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో; సమీర్ వర్మ 15-21, 19-21తో తనోంగ్‌సాక్ సెన్సోమ్‌బున్‌సుక్ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చవిచూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement