
రాణించిన రోహిత్: భారత్ 258/6
విండీస్ ఎలెవన్ 91/1
బసెటెర్రె (సెయింట్ కిట్స్): ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (50), శిఖర్ ధావన్ (51)కు తోడు రోహిత్ శర్మ (54 నాటౌట్; 8 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో రాణించగా వెస్టిండీస్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో జరుగుతున్న రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజును భారత్ ఆరు వికెట్లకు 258 పరుగుల వద్ద ముగించింది. ఓపెనర్లు రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగిన అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి (14), రహానే (5) విఫలమయ్యారు. పుజారా కుదురుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. 102 బంతుల్లో కేవలం 34 పరుగులు మాత్రమే చేయడంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి పిలుపు వచ్చింది.
దీంతో లోయర్ మిడిలార్డర్ సహకారంతో రోహిత్ చెలరేగాడు. వృద్ధిమాన్ సాహా (22), అమిత్ మిశ్రా (18 నాటౌట్) ఆకట్టుకున్నారు. వారిక్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన విండీస్ ఎలెవన్ కడపటి వార్తలందేసరికి 39 ఓవర్లలో వికెట్ నష్టానికి 91 పరుగులతో ఆడుతోంది. క్రీజులో రాజేంద్ర చంద్రిక (46 బ్యాటింగ్), షాయి హోప్ (41 బ్యాటింగ్) ఉన్నారు.