కాబూల్: అప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. అప్ఘనిస్తాన్ లెగ్‌స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అస్గర్ అఫ్గాన్‌ని నూతన సారథిగా నియమించింది. ఏడు నెలల క్రితం కెప్టెన్సీ పదవి కోల్పోయిన అస్గర్ అఫ్గాన్ మళ్లీ అఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు సారథిగా నియమితుడయ్యాడు. ఈ మేరకు అప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించింది. అస్గర్ మూడు ఫార్మాట్‌ల లోనూ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ఏసీబీ తెలిపింది.
గత ఏప్రిల్‌లో ఏసీబీ అస్గర్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి... టెస్టుల్లో రహ్మత్ షా, వన్డేల్లో గుల్బదిన్ నైబ్, టి20ల్లో రషీద్ ఖాన్‌లను కెప్టెన్‌లుగా నియమించింది. అయితే వన్డే ప్రపంచకప్‌లో అప్ఘనిస్తాన్ ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. అనంతరం రషీద్ ఖాన్‌కు మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్సీని కట్టబెట్టారు. అయితే ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో అన్ని ఫార్మాట్‌లలో అప్ఘనిస్తాన్ ఓటమి చవిచూసింది. దాంతో ఏసీబీ రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి అనుభవజ్ఞుడైన అస్గర్‌కే పగ్గాలు అప్పగించింది. 32 ఏళ్ల అస్గర్ అప్ఘనిస్తాన్ తరఫున ఇప్పటివరకు 111 వన్డేల్లో, 66 టి20ల్లో బరిలోకి దిగాడు.
Comments
Please login to add a commentAdd a comment