
అప్గానిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. యువ సంచలనం, 20 ఏళ్ల రషీద్ ఖాన్‌ను అఫ్గాన్ సారథిగా నియమించింది. ఇప్పటికే అప్గాన్ టీ20 జట్టుకు సారథిగా ఉన్న రషీద్.. ఇక నుంచి మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రపంచకప్‌లో ఆడిన అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ అఫ్గాన్ ఘోర పరాజయాలను ఎదుర్కొంది. దీంతో పేలవ ప్రదర్శనతో నిరాశపర్చిన జట్టులో సమూల మార్పులు చేయాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. దీనిలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. ఇక సీనియర్ ఆటగాడు, మాజీ సారథి అస్గర్ అఫ్గాన్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ప్రపంచకప్ ఆరంభానికి ముందు సారథిగా ఉన్న అస్గర్‌ను తప్పించి గుల్బాదిన్ నైబ్‌కు బాధ్యతలను అప్పగించింది. అయితే నైబ్ సారథ్యంలోని అప్గాన్ జట్టు టోర్నీలో ఒకటిరెండు మినహా మిగతా మ్యాచ్‌ల్లో తీవ్రంగా నిరాశపరిచింది. సారథిగానే కాకుండా ఆటగాడిగా కూడా విఫలమవ్వడంతో నైబ్‌పై వేటువేసింది. అయితే ప్రపంచకప్‌లో రషీద్ తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ అతడిపై బోర్డు నమ్మకం ఉంచింది. ఇక 20 ఏళ్ల రషీద్ ఐపీఎల్‌తో భారతీయులకు సుపరిచితుడే. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన సంచలన బౌలింగ్‌తో సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.