రవిశాస్త్రి గుడ్ బై!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ ప్రధాన కోచ్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి.. తాజాగా తన అంతర్జాతీయ క్రికెట్ కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. గత ఆరు సంవత్సరాల నుంచి ఐసీసీ క్రికెట్ కమిటీలో మీడియా రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రి ఆ పదవికి గుడ్ బై చెప్పాడు. అయితే ఇదే కమిటీకి భారత ప్రధాన కోచ్ కుంబ్లే చైర్మన్ గా ఉన్నాడు. ఇటీవల రెండోసారి కుంబ్లే ఆ బాధ్యతలను చేపట్టాడు.
కాగా, కోచ్ పదవి దక్కకపోవడంతో పాటు, కుంబ్లేకు కోచ్ బాధ్యతలు అప్పజెప్పడంతో నెలకొన్న అసంతృప్తితోనే ఐసీసీ క్రికెట్ కమిటీ నుంచి రవిశాస్త్రి వైదొలిగాడా? అనేందుకు బలమైన కారణాలు లేవు. గత కొంతకాలం నుంచి ఈ పదవికి రవిశాస్త్రి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడట. ప్రస్తుతం పరిపాలన బాధ్యతల నుంచి దూరంగా ఉండాలని భావించి మాత్రమే ఆ పదవి నుంచి రవిశాస్త్రి వైదొలిగినట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగానే ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్కు లేఖ కూడా రాసిన అనంతరమే వీడ్కోలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
టీమిండియా ప్రధాన కోచ్ పదవి ఎంపికలో భాగంగా తాను ఇంటర్య్యూ ఇచ్చినప్పుడు బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుల్లో ఒకరైన సౌరవ్ గంగూలీ అక్కడ లేకపోవడంపై మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అసలు తనతో గంగూలీకి సమస్య ఏమిటో అర్ధం కావడం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. గంగూలీ బాధ్యాతాయుతంగా ప్రవర్తించలేదంటూ తనలోని ఆవేశాన్ని వెళ్లగక్కాడు. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది. దానికి గంగూలీకి ధాటిగానే బదులిచ్చాడు. అవతలి వాళ్లకు నీతులు చెప్పేముందు మనం ఏమిటో కూడా తెలుసుకోవాలంటూ గంగూలీ చురకలంటించాడు. ఏది ఏమైనా పారదర్శకంగా కోచ్ ఎంపిక చేయాలని భావించిన బీసీసీఐకు వీరి వివాదం మరింత తలనొప్పిగా మారింది.