జట్టు నుంచి వెళ్లాక బ్యాట్ ముట్టలేదు
రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌కు దిగా..
* ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో ఓసారి చోటు కోల్పోయాక ఏ క్రికెటర్ అయినా పునరాగమనం కోసం తీవ్రంగా శ్రమిస్తూ కిందా మీదా పడుతుంటారు. అయితే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం ఈ విషయంలో బేఫికర్‌గా ఉన్నానంటున్నాడు. గత జూన్‌లో ఈ సౌరాష్ట్ర ఆటగాడు బంగ్లాదేశ్‌తో తన చివరి వన్డే ఆడాడు. అప్పటి నుంచి ప్రాక్టీస్ కాదు కదా కనీసం బ్యాట్‌ను కానీ బంతిని కానీ టచ్ చేయలేదంటున్నాడు. ఈ సమయమంతా పూర్తిగా విశ్రాంతికే పరిమితమయ్యానని చెప్పాడు.
తనకిష్టమైన గుర్రపు స్వారీతో పాటు స్నేహితులతో సరదాగా గడిపానని అన్నాడు. కేవలం రంజీ సీజన్‌కు ముందే ప్రాక్టీస్‌పై దృష్టి సారించానని, నిజానికి తన శరీరం విశ్రాంతి కోరుకుందని తెలిపాడు. ఈ సీజన్‌లో తను సౌరాష్ట్ర తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ‘బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాను. అప్పుడు కొద్ది సమయం క్రికెట్‌కు దూరంగా ఉండాలనిపించింది.
అందుకే ఆటకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కనీసం బ్యాట్, బంతిని కూడా పట్టుకోలేదు. క్రికెట్ బటన్‌ను స్విచాఫ్ చేసి ఇతర వ్యాపకాల్లో మునిగాను. ఫాంహౌస్‌లో గుర్రాలతోనూ, స్నేహితులతోనూ ఎక్కువ సమయం గడిపాను. రంజీ సీజన్‌కు నెల రోజుల ముందు ప్రాక్టీస్ ప్రారంభిస్తూ నా బలంపై దృష్టి పెట్టాలనుకున్నాను. కొన్ని జిల్లా స్థాయి మ్యాచ్‌లు కూడా ఆడాను. ఇలాంటి ప్రాక్టీస్‌తో సీజన్‌లో రాణించాను’ అని 26 ఏళ్ల జడేజా పేర్కొన్నాడు.