‘జట్టులో ఒకటి, రెండు స్థానాలకు ఎవరిని ఖరారు చేయాలనేది తప్ప, ప్రపంచ కప్‌నకు టీమిండియా ఎంపిక దాదాపు పూర్తయినట్లే!’ కొన్నాళ్లుగా విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అయితే ఈ విషయంలో ఇంకాస్త ముందుకు వచ్చి... ఒక్క స్థానంపైనే తాము ఆలోచిస్తు న్నామని చెప్పారు.
వాస్తవంగా చూసినా, భారత జట్టులో ఎవరెవరుంటారు? అనే దానిపై గతంలో ఏ ప్రపంచ కప్ సమయానికీ లేనంత ముందుగానే అభిమానులకు సైతం స్పష్టత వచ్చింది. ఫామ్, ఫిట్‌నెస్ ప్రమాణాల ప్రకారం ప్రతిష్ఠాత్మక టోర్నీ కోసం ఇంగ్లండ్ విమానం ఎక్కే 14 మంది ఎవరనేది అందరికి తెలిసిపోయింది. మిగిలిన ఒక్క బెర్తుపైనే ఉత్కంఠ నెలకొంది. మరి దానిని చేజిక్కించుకునేదెవరో?
సాక్షి క్రీడా విభాగం
ప్రపంచ కప్‌నకు 15 మంది జట్టు సభ్యుల ప్రకటనకు తుది గడువు (ఏప్రిల్ 23) దగ్గర పడుతున్న క్రమంలో భారత్–ఆస్ట్రేలియా మధ్య వచ్చే నెలలో జరుగనున్న వన్డే సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. రెండు టి20లు, ఐదు వన్డేల సిరీస్ కోసం జట్టు ఎంపికకు ముంబైలో శుక్రవారం సెలెక్టర్లు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా వారు ‘ఆ ఒక్క బెర్తు’ సంగతినీ తేల్చే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఫామ్, ఫిట్‌నెస్ ఆధారంగా స్పిన్, పేస్ కోటాల్లో ఎవరుంటారనేది అంచనాకు వచ్చినందున మిగిలిన బెర్త్ ‘రెండో పేస్ ఆల్‌రౌండర్’, ‘స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్’దేనని భావించొచ్చు. దీనికోసం ఆల్ రౌండర్‌గా విజయ్ శంకర్, బ్యాట్స్‌మెన్‌గా అజింక్య రహానే, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ మధ్య పోటీ నెలకొంది. ఎలాగూ ఐపీఎల్ ప్రదర్శన ప్రామాణికం కాదంటున్నారు కాబట్టి... ఆసీస్‌తో సిరీస్‌కు ఎంపిక, మ్యాచ్‌లు ఆడించడాన్ని బట్టి వీరిలో ప్రపంచ కప్‌నకు వెళ్లేదెవరో అప్రకటితంగానే చెప్పేయొచ్చు.
ఖరారు... తకరారు!
టాప్–3లో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, నాలుగో నంబర్‌లో అంబటి రాయుడు, అతడి బ్యాకప్‌గా దినేశ్ కార్తీక్, ఐదో స్థానంలో ధోని, తర్వాత కేదార్ జాదవ్, పేస్ ఆల్ రౌండర్‌గా హార్దిక్ పాండ్యా, స్పిన్నర్లుగా చహల్, కుల్దీప్, పేసర్లుగా భువనేశ్వర్, బుమ్రా, షమీ, ఖలీల్! ఈ 14 మంది ఇంగ్లండ్ వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. 15వ ఆటగాడిగా రిషభ్ పంత్, రహానే, రాహుల్, విజయ్ శంకర్ పోటీలో ఉన్నారు. వీరిలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు పరిశీలనలోనే లేడని భావించిన రహానే పేరు తెరపైకి రావడం ఆశ్చర్యకరం. టెస్టుల్లో రెగ్యులర్ సభ్యుడైన అతడు ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్ లయన్స్‌తో మూడు మ్యాచ్‌ల అనధికార వన్డే సిరీస్‌లో 59, 91, 0 స్కోర్లతో ఫర్వాలేదనిపించాడు.
అయినా, రహానే పేరు ప్రపంచ కప్‌నకు పరిశీలిస్తున్నారంటే అది అనూహ్యమే. ఇంగ్లండ్ వంటిచోట బహుశా అటు రిజర్వ్ ఓపెనర్‌గా, ఇటు మిడిలార్డర్‌లో పనికొస్తాడని భావిస్తున్నట్లున్నారు. ఫామ్ లేమికి తోడు టీవీ షో వివాదంతో రాహుల్ చేసుకున్న స్వయంకృతం కూడా రహానేకు కలిసొచ్చినట్లైంది. ప్రతిభావంతుడు కాబట్టి ఆస్ట్రేలియాతో సిరీస్ ద్వారా రాహుల్‌కు ఓ అవకాశం ఇవ్వొచ్చని సమాచారం. అతడు రాణిస్తే సరి... లేదంటే ఇక అంతే. మరోవైపు న్యూజిలాండ్‌తో టి20 సిరీస్ ద్వారా విజయ్ శంకర్ కొత్తగా తెరపైకొచ్చాడు. రెండో పేస్ ఆల్ రౌండర్ స్థానానికి బలమైన పోటీదారయ్యాడు. అయితే, శంకర్‌కు చోటివ్వాలంటే జాదవ్‌ను పక్కన పెట్టాలి.
కొంతకాలంగా వన్డేల్లో ప్రతిభ చూపుతున్న అతడిని ఏ విధంగానూ తప్పించలేని పరిస్థితి. తద్వారా శంకర్ రేసు నుంచి ఔటైనట్లే. అప్పుడు పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యాతోనే సరిపెట్టుకోవాలి. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నా పంత్ వన్డే సామర్థ్యం ఇప్పటికీ అనుమానమే. టెస్టులు, టి20లకు ధోని స్థానాన్ని భర్తీ చేయగలిగినా... వన్డేలకు వచ్చేసరికి మధ్య ఓవర్లలో స్ట్రయిక్ రొటేషన్, ఫినిషింగ్ సామర్థ్యాలను పంత్ పెంచుకోవాల్సి ఉంది. ధోని ఉండగా అతడికి ఎలాగూ కీపింగ్ చేసే వీలుండదు కాబట్టి ప్రపంచ కప్‌నకు పంత్‌ను బ్యాట్స్‌మన్‌గానే తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రహానే, రాహుల్‌ను కాదని తనవైపు మొగ్గుచూపితే పంత్ అదృష్టవంతుడే.
Comments
Please login to add a commentAdd a comment