మయామి ‘మాస్టర్’ ఫెడరర్
ఫ్లోరిడా (అమెరికా): నమ్మశక్యంకాని ఆటతీరుతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ ఏడాది తన ఖాతాలో మూడో ప్రతిష్టాత్మక టైటిల్‌ను జమ చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్, గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను నెగ్గిన ఫెడరర్ తాజాగా మయామి ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెడరర్ 6–3, 6–4తో విజయం సాధించాడు. ఓవరాల్‌గా ఫెడరర్ ఖాతాలో ఇది 91వ సింగిల్స్ టైటిల్‌కాగా... 26వ మాస్టర్స్ సిరీస్ టైటిల్. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 11 లక్షల75 వేల 505 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
ఈ టోర్నీ చరిత్రలో ఐదోసారి ఫైనల్‌కు చేరుకున్న నాదల్ ఐదుసార్లూ ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకోవడం గమనార్హం. ఏటీపీ సర్క్యూట్‌లో వెంటవెంటనే జరిగే ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ టోర్నీలను ఒకేసారి నెగ్గడం ఫెడరర్‌కు ఇది మూడోసారి. చివరిసారి ఫెడరర్ ఈ రెండు టైటిల్స్‌ను ఏకకాలంలో 2005, 2006లలో సాధించాడు.