
రోజర్ ఫెడరర్
ఆరేళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ తన తదుపరి లక్ష్యం 100 సింగిల్స్ టైటిల్స్ సాధించడమేనని తెలిపాడు. ఆదివారం రోటర్‌డామ్ ఓపెన్ నెగ్గడం ద్వారా కెరీర్‌లో 97వ టైటిల్ దక్కించుకున్న ఫెడరర్... సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అధికారికంగా అగ్రస్థానాన్ని అలంకరించాడు.
ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన ఫెడెక్స్ తన జోరు కొనసాగిస్తే అమెరికా దిగ్గజం జిమ్మీ కానర్స్ పేరిట ఉన్న అత్యధిక సింగిల్స్ టైటిల్స్ (109), అత్యధిక విజయాలు (1,256) రికార్డు కూడా తెరమరుగయ్యే అవకాశాలున్నాయి.