
తడబడతారా..! నిలబడతారా..!
రెండు సెంచరీలు...నాలుగు అర్ధ సెంచరీలు...తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ప్రదర్శన ఇది. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలిస్తున్న పిచ్‌పై వరుసగా ఒక్కో కొత్త రికార్డు నెలకొల్పుతూ ఆసీస్ బ్యాట్స్‌మెన్ పరుగుల పండగ చేసుకున్నారు. పరుగులు ఇవ్వడంలో మన బౌలర్లు కూడా నలుగురు సెంచరీలు పూర్తి చేసుకున్నారు. జీవం లేని పిచ్‌పై ఏమీ చేయలేక, బౌలింగ్‌లో కొత్తదనం, వ్యూహాల్లో వైవిధ్యం లేక అలా బంతులు విసిరి విసిరి అలసిపోయారు. పేస్ బౌలింగ్‌లో ‘పేస్’ తగ్గి సాధారణ బౌలర్లుగా మిగిలిపోయారు.
కొండంత స్కోరు కళ్ల ముందు ఉండగా, విజయ్ డకౌట్‌తో భారత్‌కు తొలి దెబ్బ. అయితే రోహిత్, రాహుల్ తడబడకుండా నిలబడ్డారు. రెండు రోజుల ఆట తర్వాత కూడా ఎలాంటి జీవం లేని పిచ్ ఇంకా బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ఇప్పుడు ఇదే ఆరంభాన్ని భారత్ తమకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇక మూడో రోజు మన బ్యాట్స్‌మెన్ సత్తా చూపాలి. రోజంతా నిలబడి ఆసీస్ స్కోరుకు చేరువైతేనే మ్యాచ్‌లో నిలబడతాం. ఏమాత్రం తడబడినా ఇక మ్యాచ్ మీద ఆశలు వదులుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది.
సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో భారత్ ముందు ‘భారీ’ సవాల్ నిలిచింది. ఆస్ట్రేలియా జోరుకు జవాబిస్తూ మ్యాచ్ రెండో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది. విజయ్ (0) తొలి ఓవర్లోనే వెనుదిరగ్గా రోహిత్ శర్మ (76 బంతుల్లో 40 బ్యాటింగ్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (71 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ ప్రస్తుతం మరో 501 పరుగులు వెనుకబడి ఉంది. మూడో రోజు బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడి భారీ స్కోరు చేస్తేనే ఈ టెస్టులో మనకు అవకాశాలు మిగిలి ఉంటాయి.
కాస్త తడబడినా ఆసీస్‌కు చేజేతులా అవకాశం ఇచ్చినట్లే. అంతకుముందు ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 7 వికెట్ల నష్టానికి 572 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టీవెన్ స్మిత్ (208 బంతుల్లో 117; 15 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగో సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. షాన్ మార్ష్ (116 బంతుల్లో 73; 9 ఫోర్లు, 1 సిక్స్), జో బర్న్స్ (114 బంతుల్లో 58; 10 ఫోర్లు) కూడా రాణించారు. భారత బౌలర్లలో షమీ (5/112) కెరీర్‌లో రెండో సారి ఐదు వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: రోజర్స్ (బి) షమీ 95; వార్నర్ (సి) విజయ్ (బి) అశ్విన్ 101; వాట్సన్ (సి) అశ్విన్ (బి) షమీ 81; స్మిత్ (సి) సాహా (బి) ఉమేశ్ 117; మార్ష్ (సి) సాహా (బి) షమీ 73; బర్న్స్ (సి) రాహుల్ (బి) షమీ 58; హాడిన్ (నాటౌట్) 9; హారిస్ (సి) అశ్విన్ (బి) షమీ 25; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (152.3 ఓవర్లలో 7 వికెట్లకు) 572 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-200; 2-204; 3-400; 4-415; 5-529; 6-546; 7-572.
బౌలింగ్: భువనేశ్వర్ 34-5-122-0; ఉమేశ్ 27-5-137-1; షమీ 28.3-3-112-5; అశ్విన్ 47-8-142-1; రైనా 16-3-53-0.
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) హాడిన్ (బి) స్టార్క్ 0; రాహుల్ (బ్యాటింగ్) 31; రోహిత్ (బ్యాటింగ్) 40; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (25 ఓవర్లలో వికెట్ నష్టానికి) 71.
వికెట్ల పతనం: 1-0.
బౌలింగ్: స్టార్క్ 6-2-17-1; హారిస్ 7-1-17-0; హాజల్‌వుడ్ 4-1-10-0; లయోన్ 8-1-27-0.
ఆస్ట్రేలియా ఆటగాళ్లంటే అంతే మరి... మామూలుగానే స్లెడ్జింగ్ వారికి మంచినీళ్ల ప్రాయంలా కనిపిస్తుంది. ఇక మొదటి ఓవర్లోనే వికెట్ తీస్తే ఎలా ఉంటుంది? ఆసీస్ బౌలర్ మిషెల్ స్టార్క్ కూడా సరిగ్గా అదే చేశాడు. తన మూడో బంతికే మురళీ విజయ్‌ను అవుట్ చేయడంతో తనను తాను నియంత్రించుకోలేకపోయాడు.
ఒక వైపు తన ఉద్వేగాన్ని ప్రదర్శిస్తూనే, పెవిలియన్ వైపు వెళుతున్న విజయ్ వైపు చూస్తూ... వెళ్లమంటూ నోటికి పని చెప్పాడు. దీనికి విజయ్ స్పందించకపోయినా స్టార్క్ చర్య మాత్రం తీవ్రంగా కనిపించింది. చివరకు కెప్టెన్ స్మిత్ కూడా తన ఆటగాడికి మద్దతు పలకలేదు. ‘ఆ రకంగా స్టార్క్ ప్రవర్తించడం ఆటకు మంచిది కాదు. ఇకపై వికెట్ తీసినా మా ఆటగాళ్లు అలా చేయరు’ అని స్మిత్ అన్నాడు.
సెషన్-1: స్మిత్ శతకం
రెండో రోజు కూడా ఆసీస్ ఎక్కడా తగ్గకుండా తమ జోరు కొనసాగించింది. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే స్మిత్ 168 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మాత్రం భారత్‌కు కాస్త ఊరట లభించింది. తక్కువ వ్యవధిలో వాట్సన్ (183 బంతుల్లో 81; 7 ఫోర్లు), స్మిత్ వెనుదిరిగారు. షమీ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడిన వాట్సన్ డీప్ మిడ్‌వికెట్‌లో క్యాచ్ ఇవ్వడంతో 196 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ వెంటనే స్మిత్ కూడా ఉమేశ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మార్ష్ 9 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో గల్లీలో విజయ్ క్యాచ్ వదిలేయడం మరోసారి మన ఫీల్డింగ్ వైఫల్యాన్ని చూపించింది. మరో వైపు బర్న్స్ కూడా మొదటి 17 బంతుల్లో ఒక్క పరుగు కూడా తీయలేకపోయాడు.
ఓవర్లు: 30, పరుగులు: 72, వికెట్లు: 2
సెషన్-2:
మరో భాగస్వామ్యం
లంచ్ తర్వాత మాత్రం మార్ష్, బర్న్స్ క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. దూకుడు ప్రదర్శించకపోవడంతో పరుగుల వేగం తగ్గినా... మన బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో మార్ష్ 87 బంతుల్లో, బర్న్స్ 94 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 114 పరుగులు జత చేసిన అనంతరం షమీ బౌలింగ్‌లో సాహా చక్కటి క్యాచ్ పట్టడంతో మార్ష్ పెవిలియన్ చేరాడు. ఈ సెషన్ చివర్లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వేగంగా ఆడారు.
ఓవర్లు: 29, పరుగులు: 118, వికెట్లు: 1
సెషన్-3: భారత్‌కు షాక్
ఈ సెషన్ రెండో ఓవర్లోనే బర్న్స్ వెనుదిరిగాడు. అయితే అనూ
హ్యంగా ర్యాన్ హారిస్ (25) చెలరేగిపోయాడు. భువనేశ్వర్ వేసిన ఒకే ఓవర్లో నాలుగు ఫోర్లు సహా అతను 19 పరుగులు రాబట్టడం విశేషం. చివరకు షమీ బౌలింగ్‌లో మరో భారీ షాట్ ఆడబోయి హారిస్ అవుట్ కావడంతో ఆసీస్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి వికెట్ తీసేం దుకు భారత్‌కు దాదాపు మూడు గంటలు పడితే, ఆసీస్ మాత్రం మూడో బంతికే దానిని దక్కించుకుంది.
ఈ సిరీస్‌లో ఫామ్‌లో ఉన్న విజయ్, స్టార్క్ బౌలింగ్‌లో బంతిని వెంటాడి విజయ్, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో జత కలిసిన రోహిత్, రాహుల్ ఆకట్టుకున్నారు. గత టెస్టులో విఫలమైన రాహుల్ జాగ్రత్తగా ఆడగా, రోహిత్ మాత్రం కాస్త దూకుడు ప్రదర్శించాడు. లయోన్ బౌలింగ్‌లో అతను రెండు భారీ సిక్సర్లు కొట్టాడు. చివర్లో వీరిద్దరు కొంత ఉత్కంఠకు లోనైనా, మరో వికెట్ పడనీయలేదు.
(ఆసీస్) ఓవర్లు: 3.3, పరుగులు: 34, వికెట్లు: 2
(భారత్) ఓవర్లు: 25, పరుగులు: 71, వికెట్లు: 1
3 ఒకే సిరీస్‌లో వరుసగా నాలుగు టెస్టుల్లోనూ సెంచరీ చేసిన మూడో ఆటగాడు స్మిత్. 1931-32లో బ్రాడ్‌మన్, 2003-04లో కలిస్
ఈ ఘనత సాధించారు.
24 ఒక ఇన్నింగ్స్‌లో నలుగురు భారత బౌలర్లు ఒక్కొక్కరు వందకు పైగా పరుగులు ఇవ్వడం ఇది 24వ సారి
1 ఈ సిరీస్‌లో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్ షమీ. 2011-12 సిరీస్‌లోనూ ఒకే భారత బౌలర్ (ఉమేశ్) ఐదు వికెట్లు తీశాడు.
1 ఆస్ట్రేలియాలో జట్టులోని టాప్-6 బ్యాట్స్‌మెన్ అందరూ కనీసం అర్ధ సెంచరీ చేయడం ఇదే తొలిసారి.