
హైదరాబాద్ : టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఘనత సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. 2017 అగస్టు 1 నుంచి ప్రపంచకప్ ముగిసేవరకు అత్యధిక వన్డేలు(95) ఆడిన ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. సారథి విరాట్ కోహ్లి టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో రోహిత్ విరామం లేకుండా వన్డేల్లో ఆడుతున్నాడు. దీంతో 2017 అగస్టు నుంచి టీమిండియా 111 వన్డేలు ఆడగా రోహిత్ కేవలం పదహారు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడకపోవడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన జట్టుగా టీమిండియా(111) నిలిచింది. ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఇంగ్లండ్(89), శ్రీలంక(88), పాకిస్తాన్(88)జట్లు ఉన్నాయి.
ఇక ఓవరాల్‌గా ఇలాంటి ఘనత అందుకున్న ఒకే ఒక ఆటగాడిగా రోహిత్ నిలిచాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాజాగా ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా, అదేవిధంగా ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు(5) సాధించిన ఆటగాడిగా రోహిత్ రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ సన్నద్దమవుతున్నాడు. ఇక ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టుల ఆడునుంది. ఈ పర్యటనకు ముందుగా వన్డే, టీ20లకు కోహ్లికి విశ్రాంతినిచ్చి రోహిత్‌ను సారథ్య పగ్గాలు అప్పగించాలని సెలక్టర్లు భావించారు. అయితే విశ్రాంతి తీసుకోవడానికి కోహ్లి అయిష్టత చూపడంతో అతడి సారథ్యంలోని భారత జట్టునే సెలక్టర్లు ప్రకటించారు.