
కోహ్లి, ఏబీ విశ్వరూపం
బెంగళూరు:రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్ , విరాట్ కోహ్లిలు మరోసారి విశ్వరూపం ప్రదర్శించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఇక్కడ గుజరాత్ లయన్స్ జరుగుతున్న మ్యాచ్లో డివిలియర్స్ , కోహ్లిలు రెచ్చిపోయారు. డివిలియర్స్(129 నాటౌట్; 52 బంతుల్లో 10ఫోర్లు, 12 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ విరాట్ కోహ్లి (109;55 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో బెంగళూరు 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ క్రిస్ గేల్(6) నిరాశపరిచాడు. ఆ తరుణంలో కోహ్లికి జత కలిసిన డివిలియర్స్ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించాడు. తొలుత ఈ జోడీ ఆచితూచి ఆడినా ఆ తరువాత రెచ్చిపోయింది. ఒకవైపు కోహ్లి సొగసైన షాట్లతో అలరిస్తే, డివిలియర్స్ మాత్రం బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఇన్నింగ్స్ కొనసాగించాడు. తద్వారా 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన డివిలియర్స్, ఆపై సెంచరీ చేయడానికి మరో 18 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు.
డివిలియర్స్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో సెంచరీ మార్కును చేరాడు. దీంతో ఐపీఎల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని డివీ నమోదు చేశాడు. మరోవైపు కోహ్లి 40 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, మరో 13 బంతులు మాత్రమే ఎదుర్కొని శతకం నమోదు చేశాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 229 పరుగుల భాగస్వామ్యాని సాధించడంతో బెంగళూరు నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 248 పరుగులు సాధించింది. ఇది ఈ సీజన్ లో అత్యధిక స్కోరు కాగా, ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు.