
పోష్‌స్ట్రూమ్: బౌలర్ మోర్నీ మోర్కెల్ మూడు బంతుల తేడాలో రెండు వికెట్లు తీయడంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 424 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 49 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో నాలుగో బంతికి తమీమ్ ఇక్బాల్‌ను, ఆరో బంతికి మోమినుల్ హక్‌ను మోర్కెల్ అవుట్ చేశాడు.
కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో ఇమ్రుల్ కైస్ (32) అవుటైన వెంటనే నాలుగో రోజు ఆటను ముగించగా... ముష్ఫికర్ రహీమ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 54/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 56 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులవద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.