సోషియల్ మీడియాలో.. 'సచిన్ సెండాఫ్'
న్యూఢిల్లీ: భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన క్షణాల్ని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. మాస్టర్ తో ఉన్న అనుబంధం అలాంటిది. సచిన్ చివరి టెస్టును కోట్లాది మంది వీక్షించడమే దీనికి నిదర్శనం. ముంబైకర్ చివరి రంజీ ఎప్పుడెప్పుడు ఆడాడో.. చివరి క్షణాల్ని ఎలా గడిపాడో గుర్తుందా? అన్ని ఫార్మాట్లలోనూ మాస్టర్ వీడ్కోలు సందర్భాలను రేపట్నుంచి యూ ట్యూబ్ సహా సోషియల్ మీడియాలో తిలకించవచ్చు. అభిమానుల కోసం ఈ అరుదైన సన్నివేశాలతో ఓ డాక్యుమెంటరీ రూపొందించారు.
గత నవంబర్ లో సచిన్ తన చివరి, చరిత్రాత్మక 200వ టెస్టును వెస్టిండీస్ తో ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం మాస్టర్ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగాడు. ఇక రంజీల్లో ముంబైకు ప్రాతినిధ్యం వహించిన సచిన్ తన ఆఖరి మ్యాచ్ ను హర్యానాతో ఆడాడు. సచిన్ వీడ్కోలు పలికిన క్షణాలు, ఆ సమయంలో అభిమానుల భావోద్వేగాలను.. జస్వీందర్ సిద్ధు అనే స్పోర్ట్స్ జర్నలిస్టు 38 నిమిషాలతో కూడిన డాక్యుమెంటరీ 'లాస్డ్ గుడ్ బై టు 22 యార్డ్స్'ను రూపొందించాడు. ఆ సన్నివేశాలను వివరిస్తూ ఇంగ్లీష్ లో సబ్ టైటిళ్లు పడతాయి. ఈ డాక్యుమెంటరీని యూ ట్యూబ్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ లో చూడవచ్చు.