సైనా సత్తాకు పరీక్ష
బర్మింగ్‌హామ్: గత ఏడాది ఎదురైన చేదు ఫలితాలను వెనక్కినెట్టి ఈ ఏడాదిని ఇండియన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ విజయంతో మొదలుపెట్టిన భారత స్టార్ సైనా నెహ్వాల్ మరో పరీక్షకు సిద్ధమైంది.
మంగళవారం మొదలయ్యే ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి ఏడో సీడ్‌గా బరిలోకి దిగనుంది. తొలి రోజు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. సైనాతోపాటు మహిళల సింగిల్స్ విభాగంలో పి.వి.సింధు... పురుషుల సింగిల్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బుధవారం జరిగే తొలి రౌండ్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)తో సైనా; సున్ యూ (చైనా)తో సింధు; కెంటో మొమొటా (జపాన్)తో శ్రీకాంత్; కెనిచి టాగో (జపాన్)తో కశ్యప్ తలపడతారు.
గతేడాది సెమీఫైనల్‌కు చేరుకున్న సైనా ఈసారి మరింత మెరుగైన ఫలితాన్ని సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేసింది. ‘నెల రోజులు సాధన చేసి ఈ టోర్నీకి పక్కాగా సిద్ధమయ్యాను. బరువు తగ్గి ఫిట్‌నెస్ కూడా మెరుగుపర్చుకొని అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ‘డ్రా’ కఠినంగానే ఉన్నా కనీసం క్వార్టర్ ఫైనల్ చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్నాను’ అని ప్రపంచ ఏడో ర్యాంకర్ సైనా వ్యాఖ్యానించింది. తొలి రౌండ్‌ను అధిగమిస్తే సైనాకు రెండో రౌండ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్ జూలియన్ షెంక్ (జర్మనీ)... క్వార్టర్ ఫైనల్లో నాలుగో ర్యాంకర్ షిజియాన్ వాంగ్ (చైనా) ఎదురయ్యే అవకాశాలున్నాయి.
మంగళవారం జరిగే క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో కుర్నియావాన్ (ఇండోనేసియా)తో ఆనంద్ పవార్ (భారత్); చోల్ మ్యాగీ (ఐర్లాండ్)తో సైలి రాణే (భారత్) పోటీపడతారు. మహిళల డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడికి బై లభించింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో మాథ్యూ నాటింగ్‌హమ్-లారెన్ స్మిత్ (ఇంగ్లండ్) జోడితో తరుణ్ కోనా-అశ్విని పొన్నప్ప (భారత్) జంట ఆడుతుంది.