సాకేత్‌కు తొలి ఏటీపీ డబుల్స్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తోన్న ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని కెరీర్‌లో తొలి అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) చాలెంజర్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. కోల్‌కతాలో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) ద్వయం 6-3, 3-6, 10-4తో విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) జోడిపై గెలిచింది.
73 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాకేత్-సనమ్ జంట మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. మూడుసార్లు తమ సర్వీస్‌ను కోల్పోయి, మరో మూడుసార్లు తమ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసింది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో సాకేత్ జోడి పైచేయి సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల చైనీస్ తైపీతో జరిగిన డేవిస్ కప్ పోటీలో భారత్ తరఫున అరంగేట్రం చేసిన 26 ఏళ్ల సాకేత్‌కు కోల్‌కతా ఏటీపీ చాలెంజర్ టోర్నీలో వైల్డ్‌కార్డు ద్వారా మెయిన్ ‘డ్రా’లో చోటు లభించింది.
సోమ్‌దేవ్ ఓటమి
ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత నంబర్‌వన్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. మూడో సీడ్ ఎవగెని డాన్‌స్కాయ్ (రష్యా) 3-6, 7-5, 6-2తో సోమ్‌దేవ్‌ను ఓడించి శనివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ నెదోవ్‌యెసోవ్ (కజకిస్థాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు.