భీమవరం: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని సింగిల్స్‌లోనూ మెరిశాడు. శనివారం ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో ఈ వైజాగ్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. డబుల్స్‌లో టైటిల్ నెగ్గిన ఉత్సాహంతో ఉన్న సాకేత్.. స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్‌లో జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సాకేత్ 4-6, 6-3, 6-1తో రెండో సీడ్ సనమ్ సింగ్ (భారత్)ను ఓడించాడు. 10 ఏస్‌లతో అదరగొట్టిన సాకేత్ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. డబుల్స్‌లో తన భాగస్వామిగా ఉన్న సనమ్ సింగ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన సాకేత్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు సనమ్ సింగ్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
2012లో ఇదే టోర్నీ ఫైనల్లో సనమ్ సింగ్ చేతిలో మూడు సెట్‌ల పోరాటంలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న సాకేత్ ఈ ఏడాది మాత్రం అదే వేదికపై, అదే ప్రత్యర్థిని ఓడించి బదులు తీర్చుకోవడం విశేషం. భారత డేవిస్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న సాకేత్ కెరీర్‌లో ఇది 9వ ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్.