'స్టెఫీగ్రాఫ్ బయోగ్రఫీ చదవాలని ఉంది'
ముంబై: రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తమకు పతకావకాశాలు ఉన్నాయని భారత టాప్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వ్యాఖ్యానించింది. ఈ ఈవెంట్‌లో తీవ్రమైన పోటీ ఉందని, అయితే తాను, బోపన్న మంచి సమన్వయంతో ఆడతామని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. ‘ఒలింపిక్స్ మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ ఆయా దేశాలకు చెందిన అగ్రశ్రేణి ఆటగాళ్లు జోడీగా బరిలోకి దిగుతున్నారు కాబట్టి పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. క్రీడల్లో విజయానికి హామీ ఇవ్వలేం. అయితే వంద శాతం గెలుపు కోసం ప్రయత్నించగలం.
కాబట్టి మాకు ఇదో సవాల్. అయితే సింగిల్స్, డబుల్స్ విభాగాలతో పోలిస్తే ఇందులో పతకంపై ఆశలు పెట్టుకోవచ్చు’ అని సానియా అభిప్రాయ పడింది. గత కొన్నేళ్లలో క్రీడల్లో సత్తా చాటుతున్న భారత మహిళల సంఖ్య పెరగడం మంచి పరిణామమని ఆమె పేర్కొంది. తాను ఇప్పటికే అగస్సీ, టైసన్‌ల జీవిత చరిత్రలు చదివానన్న సానియా... స్టెఫీగ్రాఫ్ ఆటోబయోగ్రఫీ చదవాలని ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించింది. తన కథను సినిమా రూపంలోకి తీసుకు వస్తే దీపికా పడుకోన్ లేదా పరిణీతి చోప్రాలలో ఒకరు నటిస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది.
ఆమె చాలా సాధించింది : సల్మాన్
సానియా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్స్’ను ఇక్కడ జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆవిష్కరించాడు. ‘కొంత మంది మూడు జన్మలెత్తినా సాధించలేనిది సానియా 29 ఏళ్లలోనే ఎన్నో ఘనతలు తన పేర లిఖించింది. ఈ వయసులోనే పుస్తకం రాయడం కూడా చెప్పుకోదగ్గ విశేషమే. ఆమె చెప్పదల్చుకున్న చాలా అంశాలను ఎప్పుడో ఏళ్లు గడిచాక కాకుండా ఇప్పుడే చెప్పేయడం కూడా మంచి ఆలోచన’ అని సల్మాన్ ప్రశంసించాడు.