
యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్‌ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలతో ముంచెత్తాడు.
న్యూఢిల్లీ: యువ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్‌ను మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలతో ముంచెత్తాడు. అతడిని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు. ఇలాంటి ఆటగాడిని భిన్నంగా చూడాల్సిన అవసరం ఉందని, సహజంగా ఆడనివ్వాలని సూచించాడు. ‘రిషబ్ పంత్‌ను ఈ తరానికి చెందిన వీరేంద్ర సెహ్వాగ్‌గా చెప్పుకోవచ్చు. భిన్నంగా చూడాల్సిన బ్యాట్స్‌మన్‌లో అతడు ఒకడు. పంత్‌ను జట్టులోకి తీసుకున్నా, తీసుకోకపోయినా అతడి ఆటతీరు మాత్రం మారద’ని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
ఐపీఎల్–12లో బుధవారం విశాఖపట్నంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉత్కంఠభరితంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 49 పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించి ‘మ్యాన్ ద మ్యాచ్’ అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఈరోజు జరగనున్న క్వాలిఫయర్ –2 మ్యాచ్‌లో పంత్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ఈ సీజన్‌లో రిషబ్ పంత్ ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు ఆడి 450 పరుగులు చేశాడు. (చదవండి: ఐపీఎల్ 12; కుర్రాళ్లు కుమ్మేశారు!)