కోల్కతా: భారత్లో తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో భవానీపూర్తో జరిగిన సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో మోహన్ బగాన్ జట్టు 296 పరుగుల భారీ విజయం సాధించింది. మోహన్ బగాన్ జట్టు విసిరిన 496 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భవానీపూర్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 199 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.
తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో రాణించిన మొహ్మద్ షమీ.. రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్లు సాధించి మోహన్ బగాన్ విజయంలో పాలు పంచుకున్నాడు. అతనికి జతగా పార్ట్ టైమ్ సీమర్ వివేక్ సింగ్ ఐదు వికెట్లతో ఆకట్టుకోవడంతో భవానీపూర్ కు ఘోర పరాజయం ఎదురైంది. 132/6 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు ఆట ప్రారంభించిన భవానీ పూర్ మరో 67 పరుగులు మాత్రమే చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. నాల్గో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భవానీ పూర్ జట్టు గంట వ్యవధిలోనే తన రెండో ఇన్నింగ్స్ ముగించడం గమనార్హం.
ఈ మ్యాచ్ లో మోహన్ బగాన్ ఆటగాడు ఆరిందమ్ ఘోష్ అజేయ శతకంతో రాణించాడు. తద్వారా భారత్ లో పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. మోహన్ బగాన్ రెండో ఇన్నింగ్స్లో ఘోష్ 125 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఈ మ్యాచ్లో ఘోష్ 225 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 5 సిక్సర్లతో శతకం సాధించాడు.