♦ బెంగళూరుకు ఫైనల్
♦ ఐపీఎల్ మ్యాచ్‌ల తరలింపు
న్యూఢిల్లీ: నీటి సమస్య కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన 13 ఐపీఎల్ మ్యాచ్‌లను ఇతర వేదికలకు తరలించారు. బాంబే హైకోర్టు తీర్పు నేపథ్యంలో లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లా నేతృత్వంలో వేదికల మార్పుపై శుక్రవారం సమావేశం జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. దీంట్లో భాగంగా విశాఖపట్నం, రాయ్‌పూర్, కాన్పూర్, జైపూర్‌లను ప్రత్యామ్నాయ వేదికలుగా నిర్ణయించారు. దీంతో రైజింగ్ పుణే తమ వేదికగా విశాఖపట్నంను ఎంచుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం నిర్ణయం తీసుకునేందుకు రెండు రోజుల గడువును కోరింది.
అలాగే ముంబైలో జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌ను కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఇక రెండో క్వాలిఫయర్‌తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌ను కోల్‌కతాకు ప్రతిపాదించారు. ‘పుణే తమ హోం మ్యాచ్‌ల కోసం విశాఖను కోరింది. ఈ అంశాన్ని పాలకమండలి ముందు ఉంచుతాం. మహారాష్ట్ర సీఎం కరవు బాధిత సహాయక నిధి కోసం రెండు జట్లు రూ.5 కోట్ల చొప్పున విరాళం ఇచ్చేందుకు అంగీకరించాయి. అలాగే మే 1న ముంబై, పుణే జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పుణేలో జరిపేందుకు అనుమతించాలని కోర్టును కోరనున్నాం’ అని రాజీవ్ శుక్లా తెలిపారు.