శిఖర్‌ ధావన్‌ను‌ చూడగానే ఏడ్చేశాను.. | Shikhar Dhawan Fan And Look Alike Ram Bahadur | Sakshi
Sakshi News home page

అప్పటి నుంచి శిఖర్‌ అనే పిచ్చి పట్టింది నాకు..

Published Tue, May 5 2020 12:10 PM | Last Updated on Tue, May 5 2020 12:54 PM

Shikhar Dhawan Fan And Look Alike Ram Bahadur - Sakshi

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటూ ఉంటాం. ముఖ్యంగా సెలబ్రిటీల పోలికలతో ఉండే సామాన్యులు కూడా కాస్తో కూస్తో క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. తమకంటూ అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. టీమిండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ పోలికలతో ఉన్న రామ్‌ బహదూర్‌ కూడా ఈ కోవకు చెందిన వాడే. ధావన్‌ ఫ్యాన్స్‌తో పాటు ధావన్‌ అభిమానాన్ని కూడా అతడు చూరగొన్నాడు. తన ఆరాధ్య దైవమైన ధావన్‌ ప్రత్యేక సందర్భాల్లో తనను విష్‌ చేస్తాడంటూ మురిసిపోతున్నాడు. కొడుకుకు జొరావర్‌(ధావన్‌ కొడుకు పేరు) అని పేరు పెట్టుకున్న రామ్‌ బహదూర్‌.. తొలిసారి ధావన్‌ను కలిసిన నాటి సంగతులను టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో పంచుకున్నాడు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌ బహదూర్‌(27) బలియాలో జన్మించాడు. లక్నోలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అతడు.. ఓ రోజు సెలూన్‌ షాప్‌నకు వెళ్లగా బార్బర్‌ అతడికి కటింగ్‌ చేసిన అనంతరం... ‘‘భయ్యా నువ్వు అచ్చం టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌లా కనిపిస్తున్నావు అన్నాడట. అనంతరం తన మీసకట్టు కూడా అతడిలా మార్చేస్తే చాలా బాగుంటుందంటూ.. శిఖర్‌ ఫొటోను రామ్‌ బహదూర్‌ ముందు ఉంచాడట. ఈ విషయం గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘అతడి మాటలు నాపై ప్రభావం చూపాయి. ఇంటికి వచ్చాక అద్దంలో చూసుకున్నా. నిజమే అనిపించింది. వెంటనే శిఖర్‌ సర్‌ పోస్టర్‌ తీసుకువచ్చి గోడపై అంటించుకున్నా. నాకు నేను కొత్తగా కనిపించాను. అప్పటి నుంచి శిఖర్‌ సర్‌ అనే పిచ్చి పట్టింది’’ అని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత శిఖర్‌ సర్‌లా దుస్తులు ధరించడం, గడ్డం, మీసకట్టు మార్చుకున్నాను. 2013 నుంచి ధావన్‌ను దేవుడిగా ఆరాధిస్తున్నా. 2015లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా తనను కలిసే అవకాశం వచ్చింది. రాయ్‌పూర్‌లో మే 9న స్టేడియం బయట నిల్చుని ఉన్నా. అప్పుడే క్రికెటర్ల బస్సు వచ్చింది. చేతులు కట్టుకుని నిల్చున్న నన్ను శిఖర్‌ గుర్తుపట్టాడు. బస్సు నుంచి దిగి వచ్చి హత్తుకున్నాడు. నేను ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఇక అప్పటి నుంచి మా మధ్య బంధం మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేసుకుంటాం. ఆయన నాకు కచ్చితంగా రిప్లై ఇస్తాడు. 

2017లో ఓ రోజు న్యూజిలాండ్‌ వర్సెస్‌ ఇండియా మ్యాచ్‌ కోసం కాన్పూర్‌ ప్రాక్టీసు చేస్తున్న సమయంలో గాడ్‌ అంటూ అరిచాను. తను నవ్వుతూ వచ్చి నన్ను పలకరించాడు. టికెట్‌ దొరికిందా అని అడిగాడు. లేదన్నాను. వెంటనే హోటల్‌కు తీసుకువెళ్లి టిక్కెట్లు చేతిలో పెట్టాడు. ఆయనను తొలిసారి కలిసినపుడు నేను గట్టిగా ఏడ్చేశా. నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని... నేను తన కుటుంబ సభ్యుడిని అని అందరికీ పరిచయం చేశాడు. ఇంతవరకు భారత్‌లో జరిగిన శిఖర్‌ మ్యాచ్‌ నేను ఒక్కటి కూడా మిస్‌ కాలేదు. నిజానికి శిఖర్‌ ధావన్‌లా కనిపించడం వల్ల కొంతమంది నాకు కూడా అభిమానులుగా మారిపోయారు. కొంతమంది నాతో సెల్ఫీలు కూడా దిగుతారు. ఆటోగ్రాఫ్‌ తీసుకుంటారు. శిఖర్‌ సర్‌పై ఉన్న అభిమానంతో నా కొడుకుకు జొరావర్‌ అని పేరుపెట్టాను’’అంటూ శిఖర్‌ ధావన్‌పై అభిమానాన్ని చాటుకున్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement