సహచర ఆటగాళ్ల కరతాళ ధ్వనుల మధ్య మాలిక్ వీడ్కోలు
లండన్ : పాకిస్తాన్ క్రికెటర్, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు. సీనియర్ ఆటగాడనే ట్యాగ్‌తో ఈ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న మాలిక్ దారుణ ప్రదర్శనతో విమర్శలపాలయ్యాడు. మూడు మ్యాచ్‌లే ఆడిన అతను 8, 0, 0 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌తో మెగాటోర్నీలో పాక్ కథ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మాలిక్‌కు చోటుదక్కకపోయినప్పటికి ఆటగాళ్లు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ‘క్రికెట్ వరల్డ్‌కప్’ అధికారిక ట్వీటర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. ఇక అంతకు ముందు మాలిక్ సైతం ట్విటర్ వేదికగా అంతర్జాతీయ వన్డేల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజు అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నాను. నాతో ఆడిన ఆటగాళ్లు, శిక్షణ ఇచ్చిన కోచ్‌లు, కుటుంబ సభ్యులు,మిత్రులు, మీడియా, స్పాన్సరర్స్, ముఖ్యంగా నా అభిమానులకు ధన్యవాదాలు. లవ్ యూ ఆల్.’ అని ట్వీట్ చేశాడు.
షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మాంచెస్టర్ వేదికగా భారత్పై ఆడాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 89 పరుగుల(డక్‌వర్త్‌లూయిస్) తేడాతో ఓడిపోయింది. మాలిక్ ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు.
20 ఏళ్లపాటు పాక్ క్రికెట్‌కు సేవలందించిన మాలిక్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం శుభాకాంక్షలు తెలుపుతోంది. మాజీ క్రికెటర్లు, అభిమానులు ట్విటర్ వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. రెండో ఇన్నింగ్స్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారు ‘ప్రతీ కథకు ఓ ముగింపు ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ముగింపుకు ఓ కొత్త ఆరంభం కూడా ఉంటుంది. మాలిక్ 20 ఏళ్లు నీ దేశం గర్వించేలా ఆడావు. అలాగే ఎంతో గౌరవం, వినయంతో నీ ఆటను కొనసాగించావు. నీవు సాధించిన ప్రతి మైలురాయి పట్ల నేనెంతో గర్వపడ్డా.’ అని సానియా మీర్జా ట్వీట్ చేసింది. 2010 ఏప్రిల్ 12న వివాహబంధంతో సానియా- మాలిక్‌లు ఒక్కటైన విషయం తెలిసిందే.
‘Every story has an end, but in life every ending is a new beginning’ @realshoaibmalik 🙃 u have proudly played for your country for 20 years and u continue to do so with so much honour and humility..Izhaan and I are so proud of everything you have achieved but also for who u r❤️
— Sania Mirza (@MirzaSania) July 5, 2019
Comments
Please login to add a commentAdd a comment