టెస్టు క్రికెట్కు సఫారీ క్రికెటర్ వీడ్కోలు
కేప్టౌన్: దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ జేపీ డుమినీ టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. దక్షిణాఫ్రికా సీనియర్ క్రికెటర్లలో ఒకరైన డుమినీ ఇక టెస్టు క్రికెట్ కు దూరంగా ఉండబోతున్న విషయాన్ని వెల్లడించారు. దాంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు డుమినీ పేర్కొన్నారు. తన నిర్ణయ తక్షణమే అమల్లోకి వస్తుందని 33 ఏళ్ల డుమినీ స్పష్టం చేశారు.
'దక్షిణాఫ్రికా తరపున టెస్టు మ్యాచ్ లను ఆడటాన్ని గౌరవంగా భావిస్తున్నా. నా టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ కు ఇదే సరైన సమయం. అదే సమయంలో 16 ఏళ్లపాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడటం కూడా గర్వంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో నా అత్యుత్తమ ఆటను ప్రదర్శించడమే నా ముందున్న లక్ష్యం'అని డుమినీ తెలిపారు. ఇప్పటివరకూ 46 టెస్టు మ్యాచ్ లు ఆడిన డుమినీ..2,103 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలున్నాయి. ఇక బౌలింగ్ లో 42 టెస్టు వికెట్లను డుమినీ సాధించారు. గత జూలై నెలలో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో డుమినీ చివరిసారి కనిపించారు.