ఆ జ్ఞాపకాలన్నీ....
మిమ్మల్ని క్రికెట్ వీరాభిమానిగా మార్చిన ఒక్క మ్యాచ్‌కానీ ఇన్నింగ్స్‌కానీ గుర్తుందా...? మీరు గ్రాండ్‌స్లామ్‌కు సలామ్ కొట్టేందుకు కారణమైన సమరాలు గుర్తున్నాయా...? ఒలింపిక్ క్రీడలు, భారత విజయాలు, ఘనతలు ఏవైనా సరే మనం ఫ్యాన్‌లుగా భావోద్వేగాలు ప్రదర్శించిన క్షణాలు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటే ఆ అనుభూతే వేరు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబసభ్యులంతా పాత ఆల్బమ్‌లు తిరగేస్తున్న వేళ... ఆపాత క్రీడా ఘట్టాలను రోజూ మీ ముందు ఉంచే ప్రయత్నమిది.
దాదాపు 37 సంవత్సరాల సమయం ఆ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని, అది చూపిన ప్రభావాన్ని ఏమాత్రం తగ్గించలేదు. వన్డే క్రికెట్‌లో వేయికి పైగా శతకాలు నమోదైనా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఈ సెంచరీకి ఉండే ప్రత్యేకతే వేరు. ఇంకా చెప్పాలంటే ఆ మ్యాచ్‌లో ఉన్న క్లిష్ట పరిస్థితి, చేసిన పరుగులు, దూకుడైన షాట్లు, తుది ఫలితం... ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే దాని విలువ ఏమిటో తెలుస్తుంది. ఇదంతా 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్ దేవ్ చేసిన 175 పరుగుల అజేయ ఇన్నింగ్స్ గురించే. అసలు ఆ మ్యాచ్ లేకపోతే భారత క్రికెట్ భిన్నంగా కనిపించేదేమో.
టన్‌బ్రిడ్జ్‌వెల్స్‌లోని నెవిల్ గ్రౌండ్ కపిల్ దేవ్ విధ్వంసానికి వేదిౖకైంది. టాస్ గెలిచిన కెప్టెన్ కపిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కొంత సమయం ఉందనుకొని షవర్ కోసం బాత్‌రూమ్‌కు వెళ్లిపోయాడు. అయితే సహచరుడు వచ్చి రెండు వికెట్లు పడ్డాయని చెప్పగా, ఆ వెంటనే మరొకరు వచ్చి మూడో వికెట్ కూడా పోయిందనడంతో హడావుడిగా బయటకు వచ్చి బ్యాటింగ్‌కు సిద్ధమయ్యాడు. 9 పరుగులకు నలుగురు ఆటగాళ్లు గావస్కర్, శ్రీకాంత్, మొహిందర్, సందీప్ పాటిల్ అవుట్ కాగా ఆరో నంబర్‌గా కపిల్ బరిలోకి దిగాడు. ఆ వెంటనే యశ్‌పాల్ శర్మ కూడా వెనుదిరగడంతో స్కోరు 17 పరుగులకు 5 వికెట్ల వద్ద నిలిచింది. ఈ దశలో ముందుగా నిలదొక్కుకొని ఆపై చెలరేగి ఆడిన కపిల్ ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది.
చిన్న మైదానం కావడం కపిల్ ఇన్నింగ్స్ గొప్పతనాన్ని తగ్గించలేదు. ఒకవైపు బౌండరీ దగ్గరగా ఉండటంతో ఫోర్ల ద్వారా పరుగులు రాబట్టిన ‘పాజీ’... బౌండరీ దూరంగా ఉన్న వైపు నుంచి రెండు, మూడు పరుగులు తీసి తెలివిగా స్కోరును పరుగెత్తించాడు. బౌలర్ తల మీదుగా నేరుగా బాదిన సిక్సర్లు దీనికి అదనం. కపిల్ అద్భుత ప్రదర్శనలో రోజర్ బిన్నీ (22), సయ్యద్ కిర్మాణీ (24 నాటౌట్) అండగా నిలిచారు. చివరకు 181 నిమిషాల తన ఇన్నింగ్స్‌లో కపిల్ 138 బంతుల్లో 16 ఫోర్లు, 6 సిక్సర్లతో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 72 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. భారత్ 8 వికెట్లకు 266 పరుగులతో ముగించింది. అనంతరం జింబాబ్వే 235 పరుగులకు ఆలౌట్ కావడంతో కపిల్ సేనకు 31 పరుగుల విజయం దక్కింది. ఆపై ఇండియా సెమీస్ చేరడం, విశ్వవిజేతగా కూడా నిలవడంతో చరిత్ర మారిపోవడం తెలిసిందే.
విశేషాలు...
అప్పట్లో బ్యాట్స్‌మన్ ఇన్నింగ్స్ మధ్యలో బ్యాట్ మార్చడం కనిపించకపోయేది. సెంచరీ ముగిశాక కపిల్ బ్యాట్ మార్చి మరింత చెలరేగిపోయాడు. టేపులు చుట్టి ఉన్న ఆ బ్యాట్ బేస్‌బాల్ బ్యాట్‌ను తలపించిందని నాటి జింబాబ్వే ఆటగాళ్లు చెప్పుకునేవారు. ఆరంభంలో భారత స్కోరు చూసి నిర్వాహకులు మ్యాచ్ త్వరగా ముగిసిపోతుంది కాబట్టి లంచ్‌కి ఆర్డర్ ఇవ్వాలా వద్దా అని సంశయపడ్డారు. చివరకు 35 ఓవర్ల వద్దే లంచ్ తీసుకున్నాక భారత సహచరులు కపిల్ వద్దకు వచ్చే సాహసం కూడా చేయలేకపోయారు. అప్పట్లో కపిల్‌కు పోటీగా భావించిన గావస్కర్... ఒక గ్లాసు మంచి నీరు తీసుకొని అద్భుత ఇన్నింగ్స్ ఆడి వస్తున్న కెప్టెన్‌కు ఎదురెళ్లి అభినందించడం ప్రత్యేకంగా కనిపించింది. చివరి వికెట్ తీసి మ్యాచ్‌ను గెలిపించాక కపిల్ కిందకు వంగి మైదానాన్ని ముద్దాడటం విశేషం. అన్నట్లు ఈ మైదానంలో ఇదే, చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాతా మరే మ్యాచ్ జరగలేదు కానీ ఒక్క మ్యాచ్‌తోనే చరిత్రకు సాక్షిగా నిలిచింది.
వీడియో లేదు...
దురదృష్టవశాత్తూ ఇంత గొప్ప ఇన్నింగ్స్‌ను టీవీ ప్రేక్షకులు ప్రత్యక్ష ప్రసారంలోగానీ వీడియో రికార్డింగ్‌కానీ చూసే అవకాశం దక్కలేదు. వరల్డ్ కప్ నిర్వాహకులు ఆస్ట్రేలియా–వెస్టిండీస్ మధ్య మ్యాచ్ చూపించేందుకు మొత్తం ఎక్విప్‌మెంట్ తరలించగా... ప్రఖ్యాత బీబీసీ సంస్థ ఆ రోజు సమ్మెలో ఉండటంతో లైవ్ సాధ్యం కాలేదు. అయితే సమ్మెలో ఉన్నా ఒక దశలో బీబీసీ రిపోర్టర్ ఒకరు భారత్ ఇన్నింగ్స్ సమయంలోనే జింబాబ్వే గెలుస్తుందని భావించి మైదానానికి రావాలా అని జట్టు మేనేజర్ డేవ్ బ్రౌన్‌ను కోరగా... ఆయన తొందరపడవద్దని తిరస్కరించాడు.
అయితే వీడియో రికార్డింగుకు సంబంధించి ఒక కథనం ప్రచారం ఉన్నా దానిపై సందేహాలున్నాయి. మ్యాచ్‌కు హాజరైన ఒక భారత అభిమాని తన వీడియో కెమెరాతో కపిల్ ఇన్నింగ్స్ షూట్ చేసి భారీ మొత్తాలకు చాలా మందికి అమ్ముకున్నాడని వినిపించింది. చివరకు కపిల్ దేవ్ కూడా పెద్ద మొత్తం అతనికే చెల్లించి సంతోషంగా ఆ టేపును తీసుకున్నాడని కూడా అన్నారు. అయితే యూట్యూబ్‌తో పాటు ఇంతగా సోషల్ మీడియా పెరిగిపోయిన కాలంలో కపిల్ సహా అభిమానులు ఎవరైనా ఇప్పటి వరకు దానిని పోస్ట్ చేయకుండా ఉంటారా...?
Comments
Please login to add a commentAdd a comment